Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులు

బ్యాంకు ఖాతాలపై ఐటి కన్ను

ఎవరైనా తప్పు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష

మరోవైపు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులు

మహబూబాబాద్ బ్యూరో మే 22 నిజం న్యూస్

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఆ నోట్లు వుంటే సెప్టెంబరు 23వ తేదీలోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అంతవరకు బయట మార్కెట్‌లో కూడా అవి చలామణిలో ఉంటాయి.

దుకాణదారులు, వ్యాపారులు తీసుకోబోమని చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే గతంలో పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు చాలామంది వ్యాపారులు, ధనవంతులు వారి బ్లాక్‌మనీని ఎలా వైట్‌ చేసుకున్నారో…ఇప్పుడు కూడా అలాగే చేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఎవరైనా సరే సెప్టెంబరు 23వ తేదీ వరకు రోజుకు పది నోట్లు చొప్పున రూ.20 వేలు బ్యాంకులో వేసి, దానికి సరిపడా మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా చేస్తే నెలకు రూ.6 లక్షల వరకు మార్చుకోవచ్చు.

అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా! అని మనవి కాని డబ్బు (ఇంకెవరివో) తీసుకొని మీ ఖాతాల్లో వేస్తే ఇబ్బందులు తప్పవు. సెప్టెంబరు 23 వరకు ప్రతి ఖాతాను ఐటీ విభాగం పరిశీలిస్తుంది. రెండు లక్షల రూపాయలలోపు రూ.2 వేల నోట్ల లావాదేవీలు ఉంటే…సాధారణ అంశంగానే పరిగణిస్తుంది.

అంతకు మించి రూ.2 వేల నోట్లు వేసినట్టయితే వాటిపై సెక్షన్‌ 68 ప్రకారం వివరణ కోరుతుంది. దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించి, ఆధారాలు చూపాలి.

గతంలో ఎన్నడూ చూపని ఆదాయం ఇప్పుడు చూపిస్తే…దానిని తప్పుడు పనిగా భావించి ఆదాయ పన్ను+జరిమానా వసూలు చేస్తుంది. ఇది ట్రాన్సాక్షన్‌ మొత్తంలో 84 శాతం వరకు ఉంటుంది.

ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుంటే…దానికి సరిగ్గా లెక్కలు చెప్పకపోతే రూ.8.4 లక్షలు ఐటీ విభాగానికి కట్టాల్సి ఉంటుంది. పొరపాటున ఏ స్నేహితుడికో సాయం చేద్దామనే ఆలోచనతో వారి డబ్బులు మీ ఖాతాలో వేసుకుంటే…ఈ భారం మీరు చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఈ విచారణలో మనీ లాండరింగ్‌ జరిగిందని ఐటీ శాఖ భావిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.

కొత్త ఖాతాలు తెరవద్దు

ధనవంతులైన మిత్రులు తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి మన పేరుతో కొత్తగా ఇంకో బ్యాంకులో ఖాతా తెరుస్తామని అంటారు. మీకు ఏమీ భయం అవసరం లేదని, సెప్టెంబరు నెల ముగియగానే ఆ ఖాతా క్లోజ్‌ చేస్తామని, ఏ సమస్య రాదని చెబుతారు.

ఇలా కొత్తగా ప్రారంభించే ఖాతాలు, అందులో వేసే మొత్తాలను బ్యాంకులతో పాటు ఐటీ శాఖ కూడా ట్రాక్‌ చేస్తుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ ఉంటుంది కాబట్టి…ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా ఒక్కరి పేరుపైనే చూపిస్తాయి. ఇది కూడా తప్పే. ఇలాంటి వాటికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Also read: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు

రిటర్న్‌ ఫైల్‌ చేసినా…

కొంతమంది ఇలాంటి డబ్బులను ఐటీ రిటర్న్‌లలోను చూపించడానికి యత్నిస్తున్నారు. పరిధికి మించి బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లను డిపాజిట్‌ చేస్తే సెక్షన్‌ 115-బీబీఈ…ప్రకారం మూడేళ్ల తరువాత కూడా ఆ రిటర్న్‌లను పునః సమీక్ష చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కాబట్టి సంబంధం లేని వ్యక్తుల రూ.2 వేల నోట్లను తీసుకొని బ్యాంకు ఖాతాల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తే…వారికి ప్రయోజనం… చేసిన వారికి నష్టం, జైలు శిక్షపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదని విశాఖకు చెందిన ఐటీ అధికారి ఒకరు సూచించారు.