Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటుకు సన్నాహాలు

చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటుకు సన్నాహాలు

మంచిర్యాల జిల్లా ప్రతినిది :మే 21
(నిజం న్యూస్) చెన్నూర్

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మారుమూల ప్రాంతం. పల్లెలు, వాగులు, వంకలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మారుమూల గ్రామాలకు బస్సులు నడవకపోగా మరికొన్ని గ్రామాలకు సాయంత్రం 4 గంటల తర్వాత బస్సు సౌకరర్యం లేదు.

చెన్నూరు సరిహద్దులో కాళేశ్వరం, మహారాష్ట్ర ఉండగా రవాణా సౌకర్యం లేక ప్రజలు ఆటోలలో ప్రయాణిస్తున్నారు. మంచిర్యాలలో బస్సు డిపో ఉండగా చెన్నూరు డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ డిపో ఏర్పాటు చేస్తామని 9 ఏళ్ళుగా ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు చెన్నూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్టీసీ డిపో ఏర్పాటు ప్రక్రియ గత 9 సంవత్సరాలుగా కొనసాగుతుండగా ప్రస్తుతం స్థల సేకరణ పూర్తి కావడం, నిధులు మంజూరు కావడం, మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా శంకుస్ధాపన జరగడంతో ఇక టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు ప్రారంభం కానున్నాయి.

ALSO READ: దొంగ నోట్ల ముద్రణ వెంటనే ఆపాలి

చెన్నూరు పట్టణంలోని గెర్రె కాలనీలో సర్వే నెంబరు 869లో 3.01 ఎకరాల స్థలాన్ని డిపో ఏర్పాటుకు కేటాయించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు కొలతలు వేసి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఆర్టీసీ అధికారులకు అప్పగించారు. డిపో ఏర్పాటుకు రూ. 4 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు ఎమ్మెల్యే సుమన్‌ మంజూరు చేయించగా మార్చి 15న మంత్రి హరీష్‌రావు డిపో ఏర్పాటుకు శంకుస్ధాపన చేశారు.

గెర్రె కాలనీలో 4 ఎకరాల కేటాయింపు

చెన్నూరులో ఆర్టీసీ డిపో ఏర్పాటు ప్రక్రియ కొన్నేళ్ళుగా నానుతూ వస్తోంది. చెన్నూరు పట్టణ శివారులోని సర్వే నంబరు 1418లో గతంలో నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించగా ఆ స్థలం బస్టాండ్‌కు దూరంగా ఉండడం, రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు విముఖత చూపారు.

2017లో చెన్నూరులోని గెర్రె కాలనీ సర్వే నంబరు 869లో 4.01 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ఇది అనుకూ లంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఈ స్థలం తమదే అంటూ వివిధ వర్గాల వారు పేర్కొనడం, ఆందోళనలు, వివిధ పరిణామాల నేపథ్యంలో డిపో ఏర్పాటు ప్రక్రియ వెనక్కి వెళ్లింది.

కొవిడ్‌ కారణంగా దీనిపై అంతగా ఎవరు దృష్టి పెట్టలేదు. గతేడాది చెన్నూరులో డిపో ఏర్పాటుపై రూ.4 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. దీంతో డిపో ఏర్పాటుపై మళ్లీ కదలిక ఏర్పడింది.

రవాణా మరింత మెరుగు

చెన్నూరులో బస్‌ డిపో ఏర్పాటైతే రవాణా మరింత మెరుగు కానుంది. పక్కనే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఉండడం చెన్నూరు మీదుగా 63వ జాతీయ రహదారితోపాటు ప్రాణహిత, గోదావరి నదులపై పలు చోట్ల వంతెనలు ఏర్పడడంతో రహదారి సౌకర్యంగా ఉంది. డిపో ఏర్పాటుతో గ్రామాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం పెరగనుంది.

ఇప్పటికే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంతోపాటు వివిధ ప్రాం తాలకు బస్సులు వెళ్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో బస్సులు మహారాష్ట్రలోని సిరొంచ వైపు రాకపోకలు సాగిస్తుండడంతో చెన్నూరు బస్టాండ్‌ ప్రయాణికులతో కళకళలాడుతుంది.

డిపో ఏర్పాటుతో చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకు రాత్రి వేళల్లో బస్సులు నడిచే అవకాశం ఏర్పడనుంది. అలాగే కరీంనగర్‌, వరంగల్‌, హైద్రాబాద్‌ లాంటి పట్టణ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం కలిగి ప్రయాణికుల ఇబ్బందులు తొలగనున్నాయి.

ఇప్పటికే మంచిర్యాల డిపోకు చెన్నూరు రూట్‌ అధిక ఆదాయం ఇస్తోంది. చెన్నూరులో బస్‌ డిపో ఏర్పాటైతే ఆర్టీసికి మరింత రెట్టింపు ఆదాయం సమకూరనుంది.

త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం

రవీంద్రనాధ్‌, డిపో మేనేజర్‌, మంచిర్యాల

చెన్నూరు బస్‌ డిపో ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని అప్పగించారు. ఇప్పటికే 30 శాతం నిధులు వచ్చాయి. త్వరలోనే టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తాం. టెండరు పూర్తి తర్వాత దశల వారీగా పనులను ప్రారంభించనున్నారు….