ఎల్‌ఐసీకి హైకోర్టు జరిమానా

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి హైకోర్టు జరిమానా విధించింది. గతంలో సింగిల్ జడ్జి ధర్మాసనానికి ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకుండా.. అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు మూడు అప్పీల్ కేసులకు సంబంధించి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1.5 లక్షలు జరిమానా విధిస్తూ చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. సబ్‌స్టాఫ్ పోస్టులకోసం ఎల్‌ఐసీ రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. రెండు నోటిఫికేషన్లలో కలిపి 50 పోస్టులు భర్తీ కాలేదు. ఆ పోస్టుల్లో తమను నియమించాలని కోరుతూ.. పరీక్షలకు హాజరై మెరిట్ లిస్ట్‌లో ఉన్న ఎల్‌ఐసీ తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు ఉండి, మెరిట్ జాబితాలో ఉన్న తాత్కాలిక సిబ్బందిని మిగిలిపోయిన ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, ఈ మేరకు వారు సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎల్‌ఐసీ.. సింగిల్‌జడ్జి ధర్మాసనం ఎదుట హామీ ఇచ్చింది. 8 వారాల్లో వారి నియామకాలు చేపట్టాలని కోర్టు గత ఏడాది జూలైలో ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్లు ధిక్కరణ పిటిషన్ వేశారు. ధిక్కరణ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, పిటిషనర్లు ఎల్‌ఐసీ గుర్తించిన జోన్‌లో లేరంటూ సింగిల్ జడ్జి తీర్పుపై ఎల్‌ఐసీ అప్పీల్ దాఖలుచేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం.. హామీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పీల్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఫైన్ వేసి పిటిషన్లను కొట్టేసింది.