ఒలింపిక్స్ శిక్షణ కోసం రెండు కోట్లు ఇస్తా… బంగారు పతకం తేవాలి… సీఎం కేసీఆర్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నికాత్ నజ్రిన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.
ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
Also read: వడదెబ్బ లక్షణాలు ఇవి…. జాగ్రత్తలు ఇదిగో..
సచివాలయంలో నిఖత్ జరీన్ సీఎంతో ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
అందుకు సంబంధించిన ఖర్చుల కోసం రూ. 2 కోట్లను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రులు మహమ్మద్ అలీ, సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాలరాజు బాల్క సుమన్, విటల్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డా. ఈడిగ ఆంజనేయ గౌడ్, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు.