25 మంది సిట్టింగు ఎమ్మెల్యేలకు అవకాశం లేనట్టే

ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం
ఎమ్మెల్యేలు నెలలో 21 రోజులు నియోజకవర్గాలలో ఉండాలి
25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టే అవకాశం ఉంది
మహబూబాబాద్ బ్యూరో మే 17 నిజం న్యూస్
హైదరాబాద్: బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు చేసిన ఆయన.. ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ అసహనం వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళ్లకుండా పైపై ప్రచారాలు పక్కనపెట్టాలని, ఎన్నికల సమయానికి లోపాలను సరిద్దుకోవాలని సూచించారు. హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు సూచనలు చేసినా వైఖరి మారకుంటే టికెట్లు రావని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
పథకాల ప్రచారంపై ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నెలలో 21 రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌కు 103 సీట్లు వస్తాయని తెలిపారు.
హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన మేర జరగలేదని, విభేదాలు, విమర్శలు పక్కన పెట్టి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు.
వచ్చే ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగరేసి హ్యాట్రిక్ నమోదు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించారు. అయితే రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా వచ్చే సహజమైన వ్యతిరేకతతో కొంతమందిని మార్చాలని గులాబీబాస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ALSO READ: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు… సస్పెన్షన్
కనీసం 25 మంది సిట్టింగు ఎమ్మెల్యేలను పక్కనపెట్టే అవకాశముందని తెలుస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలను మార్చితే.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. దీనికితోడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ.. కారు పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి.
ఈ సారి తమకే టికెట్ అని కొందరు అంటుంటే.. లేదు లేదు.. తమకే టికెట్ అని మరికొందరు ప్రచారం చేసుకోవడం పార్టీలో అంతర్గత సమస్యలకు కారణం అవుతోంది.
పని చేయని ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం కష్టమని మొదటి నుండి హెచ్చరిస్తున్న కేసీఆర్.. ప్రస్తుతం అలాంటి వారిని ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారిని నిలబెట్టేందుకు.. ఎవరైతే బాగుంటుందనే చర్చలు కూడా జరిపినట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీకి మొదటి నుండి పని చేసిన వాళ్ళకి, ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళకి, కేసీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నవారికి ఈ సారి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లు, పని చేసిన వాళ్లను కూడా పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది..