Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యుత్ వైర్లు తగిలి దగ్ధమైన గడ్డి

మహబూబాబాద్ తొర్రూర్ మే 17(నిజం న్యూస్)

ట్రాక్టర్ పై పశుగ్రాసం తరలిస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి అగ్నికి గడ్డి దగ్ధమైన ఘటన బుధవారం మండల పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని కొమ్మనపల్లి తండా పంచాయతీ పరిధిలోని భూక్య తండా కు చెందిన భూక్య బాసు పశువుల మేత కోసం తన పొలంలోని ఎండు గడ్డిని ట్రాక్టర్ పై తరలిస్తుండగా తండాలో విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి.
అప్రమత్తమైన డ్రైవర్ తండావాసుల సహకారంతో ట్రాక్టర్ ఇంజన్ కు, డబ్బా కు పొడవాటి తాడు కట్టి ట్రాక్టర్ ను తండా పొలిమెరలో నిలిపాడు. మంటల ధాటికి గడ్డితోపాటు ట్రాక్టర్ డబ్బా కాలిపోయింది. దగ్ధమవుతున్న గడ్డిని, ట్రాక్టర్ లో చెలరేగుతున్న మంటలను తండావాసులు నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాణ నష్టం తప్పింది.

ALSO READ: జూన్ 12 నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
ట్రాక్టర్ లోని 250 మోపుల గడ్డి ఆహుతైందని, పశుగ్రాసం, ట్రాక్టర్ డబ్బా కాలిపోవడంతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
తండాలో వైర్లు కింద కు వేలాడుతూ ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోయారు.