Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం

రైతన్నకు రక్షణగా రక్షక భటులు ..నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీస్.

జమ్మికుంట మే 16 (నిజం న్యూస్)

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా, రైతన్నలకు కూడా అండగా నిలవాలని, రైతులను మోసం చేసే వారి భరతం పట్టాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు.

నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు అనే వ్యాపారి వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా మోసం చేస్తే, అతనిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా పిడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో అన్నదాతలను మోసం చేసిన సదరు వ్యాపారిని చర్లపల్లి జైలుకి తరలించారు.

ఇక నేడు అన్నదాతలకు అండగా నకిలీ విత్తనాల విక్రయదారుల భరతం పట్టడానికి రంగం సిద్ధం చేశామని వెల్లడించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందినట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బ రాయుడు అన్నారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యాపారులు, మధ్యదలారీలు రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు.

రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందస్తు చర్యలకై కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నకిలీ విత్తనాల నియంత్రణకై కరీంనగర్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ALSO READ: నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్ పాత్ర కీలకం

ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నంబర్ 8712670760, ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 87126 70708 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు.

నకిలీ విత్తనాల విక్రయాలపై కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతారని చెప్పారు. నకిలీ విత్తనాల సరఫరా, విక్రయాల వ్యవహారంలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా సంబంధం ఉన్న వ్యాపారులు, వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కమిషనరేట్ వ్యాప్తంగా స్థానిక పోలీసులతో
ప్రత్యేక బృందాలకు చెందిన పోలీసులు నకిలీ విత్తనాల విక్రయాల నియంత్రణకు తనిఖీలను నిర్వహించనున్నారని చెప్పారు.