మీకు రేషన్ ఇస్తే మా వారికి రేషన్ మిగలదు..?
రేషన్ కోసం పరేషాన్ అవుతున్న కొత్తూరు టిడ్కో వాసులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 16,(నిజం న్యూస్) బ్యూరో :: కొత్తూరు జగనన్న టిడ్కో ఇళ్ల నివాసులు ప్రతి నెల రేషన్ కోసం పరేషాన్ అవుతున్నారు. రామచంద్రపురం పట్టణం ఒకటో వార్డు అయిన కొత్తూరు గ్రామానికి వచ్చే ఇంటింటికీ రేషన్ బియ్యం వాహనం నిర్వాహకులు కొత్తగా టిడ్కో అపార్ట్మెంట్లలోకి కాపురానికి వచ్చిన వారు తమకు రేషన్ ఇమ్మని వాళ్ళని అడుగుతుంటే మీకు రేషన్ ఇవ్వడానికి మా దగ్గర ఎలాట్ మెంట్ లేదని కచ్చితంగా చెబుతున్నారు.
మీకు రేషన్ ఇచ్చినట్లయితే మా కార్డుదారులకు ఇచ్చేందుకు ఇక రేషన్ మిగలదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. అలాగే ఈ గృహాలకు సమీపంలో ఉండే మాలపాడు ఇంటింటికి బియ్యం పంపిణీ వాహనాన్ని అడుగుతుంటే వాళ్లు సైతం ఇదే సమాధానం చెప్పి మొండి చెయ్య చూపిస్తున్నారు.
ALSO READ: ఫోన్ లో మాట్లాడుతూ కుట్లు వెయ్యడం మర్చి పోయిన డాక్టర్…రక్త స్రావం తో బాలింత మృతి..!
మరోవైపు వీళ్లు ఇంతకుముందు నివసించిన ఇళ్ల దగ్గరికి పోయి రేషన్ తెచ్చుకుందామంటే.. అక్కడ రేషన్ వాహనము ఎప్పుడొస్తుందో తెలియక టిడ్కో నివాసులు ఇలా రేషన్ కోసం నానా తిప్పలు పడుతున్నారు.
అనుకోకుండా వీళ్ళు లేని సమయంలో అక్కడి రేషన్ వాహనం రేషన్ బియ్యం తదితర సరుకులను పంపిణీ చేయడం జరుగుతోంది. తీరా టిడ్కో ఇళ్ల నుంచి వీళ్లు బయలుదేరి అక్కడకు వెళ్లే సమయానికి అక్కడ రేషన్ బియ్యం వాహనం జాడ లేకుండా పోతుందని వాపోతున్నారు.
ఇకనైనా పౌరసరఫరాల అధికారులు టిడుకో గృహవాసుల వెతలను అర్థం చేసుకొని ఇంటింటికి రేషన్ సరఫరా వాహనం ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చేలా చేసి వాళ్లకు రేషన్ అందేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు