జయహో సర్ ఆర్ధర్ కాటన్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 14,(నిజం న్యూస్) బ్యూరో :: రాష్ట్ర నీటి సంఘాల అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ (2008-2011) కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వై.ఎస్.ఆర్.సి.పి. రైతు విభాగం
రామచంద్రపురం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొవ్వూరి త్రినాథ్ రెడ్డి
నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి సందర్భంగా – భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నదుల అనుసంధానం జరగాలని 1850 సంవత్సరంలోనే భవిష్యత్ దర్శనం చేసిన విశిష్ట మూర్తి ఆర్ధర్ కాటన్. అతి తక్కువ ఖర్చుతో నదులను అనుసంధానం చేయగలిగే మ్యాప్ను (గార్లెండింగ్ ఆఫ్ ఇండియా) రూపొందించిన గొప్ప వ్యక్తి. కృష్ణానదిపై ఆనకట్టకు 1840లో ప్రతిపాదనలు తయారు చేసి బ్రిటీషు ప్రభుత్వానికి సిఫార్సు చేయడమే కాకుండా 1852లో గోదావరి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసి, అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఆంధ్రదేశం అన్నపూర్ణగా, దక్షిణ భారత ధాన్యాగారంగా చిరకీర్తి పొందడానికి మూలకారకుడాయన.
ఆర్ధర్ కాటన్ ఇంగ్లండ్ దేశం, కాంబర్ మిర్ అబిలో క్రీ.శ. మే 15, 1803 సంవత్సరంలో హెన్రీ కాలె కాటన్ దంపతులకు 10వ సంతానంగా జన్మించాడు. కాటన్ సోదరులు అందరూ కూడా ఏదో ఒక రంగంలో నిష్ణాతులు కావటం విశేషం. 15 సంవత్సరాల వయస్సులోనే ఆడీస్ కాంబెలో మిలటరీ క్యాడేట్ ట్రైనింగ్ పొంది 1821లో సౌత్ ఇండియాలో మద్రాస్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఉద్యోగం పొందాడు. కరువుతో అల్లాడుతున్న మధుర, కోయంబత్తూరు, తిరునల్వేలి ప్రాంతాలలో చెరువులను అభివృద్ధిచేసి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేశాడు. 1829 నుండి 1834 మధ్యలో కావేరి, విశాఖ సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురైన సమయంలో గోడ నిర్మాణం చేపట్టి ఆ ప్రాంతం నష్టపోకుండా నివారించగలిగాడు. 1837 మద్రాసు పోర్టును అభివృద్ధి చేశాడు.
ALSO READ: బాగా చదివిస్తానన్నావు.. ఇలా వదిలేసి వెళ్లిపోయావేంటమ్మా
1844లో రాజమండ్రి దగ్గర గోదావరి నదిపై 4 పాయలుగా ఆనకట్ట నిర్మాణమే శరణ్యమని గుర్తించి తగిన ప్రతిపానదలు, సూచనలు, 12 లక్షల వ్యయంతో సమగ్ర నివేదిక పంపించగా, వారు తిరస్కరించారు. ఈ ప్రాంత ప్రజల దుస్థితిని స్పష్టంగా అర్ధంచేసుకున్న కాటన్ మరలా బ్రిటీషు ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి, వారితో చర్చించి, వారి నుంచి అనుమతి తీసుకొన్నాడు. 1847 నుండి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గోదావరి ఆనకట్ట నిర్మాణం ప్రారంభించాడు.
1852లో గోదావరి ఆనకట్ట నిర్మాణం పూర్తిచేసి, ఈ ప్రాంత ప్రజలందరి హృదయాలలో అపర భగీరథుడిగా మిగిలి నేటికీ వేనోళ్ళ ఘనకీర్తిని పొందుతున్నారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు దేవాలయాలను సందర్శించినవుడు మొదటగా అన్నం పెట్టిన వాడే దేవుడిగా భావించి “కాటనాయనమః”, “సర్ ఆర్ధరాయ నమః” అని స్మరించుకుని మిగిలిన దేవుళ్ళకు మొక్కడం ఆనవాయితీ.
భారతదేశ చరిత్రలో ఇలాంటి డెల్టాను అంటే “కృష్ణా, గోదావరి డెల్టాల వ్యవస్థ”ను కాలువ – ఆయకట్టు డ్రైనేజీ ఈ పద్ధతిలో నిర్మించి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడైనాడు. తెలుగు – ఇంజనీర్ వీణం వీరన్న, కాటన్తో కలసి బ్యారేజ్ నిర్మాణంలో పాలు పంచుకోవటం తెలుగువారందరికీ గర్వకారణం.
అతి చౌకగా రవాణా జరిగే జల రవాణా వ్యవస్థను దేశచరిత్రలో అత్యంత పటిష్టంగా అమలు పరిచిన తొలి వ్యక్తి కాటన్. ఆయన నాడు నిర్మించిన బకింగ్ హామ్ కెనాల్క ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ బడ్జెట్ను కేటాయించి జల రవాణాను పునరుద్ధరిస్తున్నది. ఆర్ధర్ కాటన్ తరువాత స్వతంత్ర భారతదేశంలో ఎమ్.ఎన్. దస్తూర్, కె.ఎల్.రావు మొదలైన గొప్ప వ్యక్తులు దేశంలో నదుల అనుసంధానికి సంబంధించి ఎన్నో సూచనలు చేసారు. అందుకే సర్ ఆర్ధర్ కాటన్ చరిత్రలో నిలిచియున్నారు.