Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాగా చదివిస్తానన్నావు.. ఇలా వదిలేసి వెళ్లిపోయావేంటమ్మా

మాతృ దినోత్సవం నాడే అనంత లోకాలకు
ఏగిన ఏడుగురు తల్లులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 15,(నిజం న్యూస్) బ్యూరో :: మధ్యాహ్నానికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిన అమ్మ ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్న నా పిల్లలకు నేనేం చెప్పను.. ఎలా ఓదార్చను… ఇదీ ఒక తండ్రి బాధ.. నువ్వు లేకపోతే ఎలా బతకాలమ్మా.. నిన్నటి వరకూ అన్నీ నువ్వే చూశావ్… ఈ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే ఎలాగమ్మా.. మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా ఇదీ ఓ యువతి రోదన.. నన్ను బాగా చదివిస్తానన్నావు.. ఇలా వదిలేసి వెళ్లిపోయావేంటమ్మా. ఇదీ ఒక యువకుడి వ్యధ…

నా పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానన్నావు.. ఉదయం వరకూ మా మధ్యనే ఆనందంగా తిరిగావు.. మళ్లీ వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు.. నా పెళ్లి ఎవరు చేస్తారమ్మా… మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా.. ఇదీ నాలుగు రోజుల కిందట నిశ్చతార్థమైన ఒక కుమార్తె తీరని బాధ.. ఇలా కాకినాడ జీజీహెచ్ ప్రాంగణం మృతుల బంధువుల రోదనలతో నిండిపోయింది.. మృతదేహాలను చూస్తూ బోరున విలపించారు.. గుర్తుపట్టలేని విధంగా మారిన శరీరాలను చూసి వెక్కివెక్కి ఏడ్చారు. అమ్మ లేదని ఇక తిరిగిరాదని తెలిసి పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. మాతృ దినోత్సవం రోజున ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు మాతృమూర్తుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

రెప్పపాటు లోనే ఏడుగురు మాతృమూర్తులూ తిరిగిరాని లోకాలకు….
(నిజం న్యూస్)/తాళ్లరేవు/యానాం/కాకినాడ: మాతృ దినోత్సవం రోజే ఏడుగురు మాతృమూర్తులు కానరాని లోకాలకు పోయి తీరని వ్యధ మిగిల్చారు. కాసేపట్లో ఇంటికి వెళ్లిపోతా మనుకునేలోగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏకంగా ఏడుగురు మాతృమూర్తులు ఆదివారం తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎప్పటిలాగే వీరంతా అపెక్స్ రొయ్యల ఫ్యాక్టరీకి ఉదయం 6 గంటలకు ఏ-సిప్ట్ విధులకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. మరో 15 నిమిషాలు ఆగితే అందరూ యానాంలోని ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఈ లోపుగా విధి వెక్కిరించింది.

మోజో బస్సు రూపంలో వచ్చి వీరి నిండు ప్రాణాలను గాల్లో కలి పేసింది. ప్రమాదం సమయంలో వీరంతా కాపాడండి అంటూ హాహాకారాలు చేశారు. కానీ రెప్పపాటులో మోరం జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే పెద్దశబ్దంతో బస్సు ఆటోను ఢీ కొట్టి పావు కిలో మీటరు దూరం ఈడ్చుకుపోయింది.

ALSO READ: త్వరలో 23 కిలో మీటర్ల మేర అండర్ డ్రైనేజ్

ఆదే సమయంలో ఆటోలోంచి ఒక్కొక్కరు కింద పడిపోయారు. కొందరి కాళ్లు, చేతులు తెగిపడి రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి . కొందరి తల భాగాలు నుజ్జునుజ్జయిపోయాయి. రెప్పపాటులో జరిగిన ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు తేరుకోలేక పోయారు. కళ్లెదుటే ఆరుగురు చనిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ లోగా మరొకరు గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఆటో వెనుక కూర్చున్న కొందరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు.

మృతి చెందిన వారంతా యానాంలో నిరుపేద కుటుంబా లకు చెందిన మహిళలు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు మృతదేహాలను కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వ హించనున్నారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వీరందరినీ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆటోడ్రైవర్ వెంకటేశ్వరరావు, ప్రమాదానికి కారణమైన మోజో బస్సు డ్రైవర్ మహేష్ఇద్దరు సురక్షితంగానే ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బస్సు పుదుచ్చేరి రిజిస్ట్రేషన్తో ఉండగా, ఆటో ఏపీ05 టీడీ 5676 నెంబర్లో ఉంది. సదరు ఆటో డ్రైవర్ తరచూ మహిళల ఇంటికి వెళ్లి నేరుగా అపెక్స్ రొయ్యల ఫ్యాక్టరీ వద్ద దించుతాడు. తిరిగి ఈయనే తీసుకువెళతాడు. ఈ ఆటో ఉద్యోగుల తరలింపునకు కంపెనీయే నడుపుతోందని ప్రమాదంలో మృతిచెందిన వెంకటలక్ష్మి భర్త కోటేశ్వరరావు విలపించాడు.

ప్రమా దానికి కారణమైన ఇద్దరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యానాం అధికారులకు ఫోన్లో సమాచారం అందించడంతో వారంతా వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. 216 నెంబర్ జాతీయ రహదారి మృత్యు పాశంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రధానంగా కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి ప్రారంభమైనా కాకినాడ రూరల్ వద్దకు వచ్చేసరికి తాళ్లరేవు వరకు చాలా ఇరుగ్గా ఉంటోంది. రెండువైపులా వాహనాల రాకపోకలకు ఒకటే దారి. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తరచూ ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు.

మృతులు వీరే…
చేసెట్టి వెంకటలక్ష్మి(11), మెట్లకూరు, కర్రి పార్వతి (44), మెట్లకూరు, కల్లి పద్మ(45), కొత్త బస్టాండ్, నిమ్మకాయల లక్ష్మీ(54), కురసాంపేట, బొక్కా అనంతలక్ష్మి(47), ఫ్రాన్స్ తిప్ప, చింతపల్లి జ్యోతి(38), వెంకట్నగర్, గుడపనేటి సత్యవతి(38), ఫ్రాన్స్ తిప్ప, వీరంతా యానాంకు చెందిన వారే.

క్షతగాత్రులు వీరే..

నోట్ల సత్యవేణి(28), కురసాంపేట, ఓలేటి లక్ష్మి (35), కురసాంపేట, మల్లాడి గంగాభ వాని (25), ఫ్రాన్స్ తిప్ప, రచ్చా వెంకటేశ్వరమ్మ, (45), ఫ్రాన్స్ తిప్ప, గుడపనేటి ప్రభావతి (18), ఫ్రాన్స్ తిప్ప, కోటి నీలిమ (26), గణపతి నగర్, చింతపల్లి మంగాయమ్మ(50), వెంకట్ నగర్. వీరంతా కూడా యానాలకు చెందిన వారే. ప్రస్తుతం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.