పవర్ కట్ అనేది ఈ రెండు గ్రామాలకు నిరంతర సమస్య

అప్రకటిత విద్యుత్ కోతతో అవస్థలు
తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం)
మే 10.. నిజం న్యూస్..
బిక్కవోలు మండలంలో మెళ్ళూరు,ఆరికరేవుల గ్రామాలకు సంబందించిన విద్యుత్ సబ్ స్టేషన్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేయడంతో ఈ రెండు గ్రామాలు శివారు గ్రామాలు కావడం పైగా వేరే జిల్లా పరిధిలో ఉండటంతో పవర్ కట్ అనేది ఈ రెండు గ్రామాలకు నిరంతర సమస్యగా మారింది.
స్థానిక బిక్కవోలు మండల స్థాయి అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న ఫలితం ఉండటం లేదని ఈ రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్య పై బిక్కవోలు మండలం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ని సంప్రదించగా లోడ్ ప్రాబ్లెమ్ వలన ఈ సమస్య వస్తుందని పేర్కొనగా,మరి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి కాదా అని అడిగితే వారి నుండి సరియైన వివరణ రావడం లేదు.
పైగా మండలంలోని పందలపాక సబ్ స్టేషన్ ఈ రెండు గ్రామాలను అనుసంధానం చేసే వరకు ఈ సమస్య తప్పదు అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ” మబ్బు వేసిందని వెనకటికి ఎప్పుడో ముసలమ్మ ముంతలో నీళ్లు ఒంపుకున్నట్లు ఉందని” స్థానికులు వాపోతున్నారు.
ALSO READ: ఆంత్రిక సురక్షిత సేవ పథక అవార్డు అందుకున్న ఎస్సై
ప్రభుత్వ పరంగా ఎటువంటి పవర్ కట్ ప్రకటన లేనప్పటికీ అధికారులు మాత్రం ఇష్టానుసారం రాత్రి, పగలు తేడా లేకుండా కోత పెడుతున్నారు.ముఖ్యంగా మంగళవారం అర్ధరాత్రి వరకు ఉన్న పవర్ కట్, బుధవారం ఉదయం నుండి కూడా కొనసాగడంతో వేసవి నేపథ్యంలో పిల్లలు,వృద్ధులు నానా అగచాట్లు పడుతున్నారు.
అలాగే మామిడాడ సబ్ స్టేషన్ కి ఫోన్ చేస్తే అవతల వైపు నుండి సమాధానం ఆశించడం వృధా ప్రయాస అన్నట్లుగా సిబ్బంది వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఈ సమస్య పై ఎన్ని సార్లు పిర్యాదు చేసిన అది బుట్టదాఖలు అవుతుండటం గమనార్హం.ఇప్పటికైనా సిబ్బంది ప్రజలు అవస్థను గమనించి ఈ సమస్యను సత్వరం పరిష్కారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.