Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆనాటికీ నేటికీ గిరిజనుల జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదు

అల్లూరి స్ఫూర్తితో గిరిజనులకు అండ దక్కాలి !
తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత, ఆదివాసీల ఆరాధ్య నేత అల్లూరి సీతారామరాజు అమరుడై 99 ఏళ్ళు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. 1924 మే7న అల్లూరి సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చి చంపారు. ఆనాటికీ నేటికీ గిరిజనుల జీవితాల్లో ఎలాంటిమార్పూ చోటుచేసుకోలేదు. ఆనాటి దోపిడీ వ్యవహారం ఇంకాకొనసాగుతోంది.

ఆదివాసుల హక్కులను స్వతంత్ర భారతంలోనూ కాలరాస్తున్నారు. అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో… ఆదివాసీల మౌలిక సమస్యల పరిష్కారం కోసం, బ్రిటిష్‌ వలస పాలన అంతంకోసం 1922 ఆగష్టు నుండి 1924 జూన్‌ వరకు విశాఖ,గోదావరి మన్య ప్రాంతంలో మహోధృ త పోరాటం సాగింది.

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను గడగడలాడిరచిన ఈ పోరు స్వాతంత్యోద్యమ్ర చరిత్రలో మన్యం విప్లవంగా ప్రాచుర్యం పొందింది. మన్య విప్లవం ప్రారంభమై వంద సంవత్సరాలవుతోంది. ఆ పోరాట లక్ష్యాలు నేటికీ నెరవేరలేదు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఓడిరచి దేశానికి స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్ళు అయ్యింది. కానీ దోపిడీ, పెత్తనం పోలేదు.

తెల్లదొరలు పోయి నల్లదొరల పాలన వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టబెట్టే విధానాలతో దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోంది. అల్లూరి మన్య విప్లవ పోరాట లక్ష్యమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం నేడు మరింతగా ముందుకు తీసుకోపోవాల్సి ఉంది.

అల్లూరి, మన్య పోరాట ఆదివాసీలు ఏ మౌలిక సమస్యల పరిష్కారం కోసమైతే పోరాడారో అవి నేటికీ పరిష్కారం కాలేదు. భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు కొన్ని రక్షణలు, హక్కులు కల్పిస్తూ 5,6 షెడ్యూళ్లలో పొందుపర్చారు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఎన్ని చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. 1/70చట్టం ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర`గోదావరి మన్యంలో వేలాది ఎకరాలు అన్యాక్రాం తమైపోయాయి. వీటిని గిరిజనేతర భూస్వాములు నేటికీ చట్టవిరుద్ధంగా అనుభవిస్తున్నారు.

ALSO READ: అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి

కాంగ్రెస్‌ పాలన లో కేంద్రప్రభుత్వం అటవీ రక్షణ చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ హక్కులు కల్పించి నప్పటికీ, వారి సాగు భూమికి,పోడు భూమికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తూ వచ్చాయి. పోడు భూముల హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపిస్తున్నారు.

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు ఉన్నప్పటికీ మైదాన ప్రాంత కాంట్రాక్టర్లు, పాలకపక్ష నేతలు యథేచ్ఛగా గనులు తవ్వి వందల కోట్లు ఆర్జిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రధానంగా ఆదివాసీ కుటుంబాలే భూమిని, ఊరును, ఉపాధిని కోల్పోయారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా వారికి న్యాయమైన నష్టపరిహారం ఇవ్వడంలేదు.

షెడ్యూల్‌ ప్రాంతంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు లేవు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీల ఉద్యోగాలకు జీవో నెం:3 రక్షణగా ఉండేది. దానిని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అనేక ఆదివాసీ వ్యతిరేక చర్యలు చేపట్టి ఆదివాసీల అస్థిత్వానికే ప్రమాదం తెచ్చిపెడుతోంది.

ఆదివాసీ చట్టాలను సవరించి, రద్దుపర్చి తీవ్ర అన్యాయం చేస్తోంది. తెగల మధ్య అనైక్యతను పెంచే కుట్రలను చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రాంతంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడంలేదు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలను అమలు చేయడం లేదు.

షెడ్యూల్‌ ప్రాంతంలో పంచాయతీలకు పీసా చట్టం ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు.షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనేతర భూస్వాముల, వ్యాపారుల,కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నాయి.ఆదివాసీ లకు అన్యాయం చేస్తు న్నాయి. నాడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆదివాసీలతో రోడ్లు, ఘాట్‌ రోడ్లు వేయించేది.

కూలీ చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించేవారు. బ్రిటిష్‌ అటవీ విధానాన్ని కఠినంగా అమలు జరిపి ఆదివాసీ ల సాంప్రదాయక పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. అటవీ ఉత్పత్తులను సేకరించడంపై ఆంక్షలు
విధించారు. బ్రిటిష్‌ రెవెన్యూ చట్టాలు ఆదివాసీల స్వంత భూములు కోల్పోయే పరిస్థితి తీసుకు వచ్చింది.

విశాఖ`గోదావరి మన్యంలో తమ జీవనానికి ఏకైక ఆధారమైన భూములను ఆదివాసీలు పెద్ద ఎత్తున కోల్పోయారు. దీనికి తోడు మైదాన ప్రాంతం నుండి వచ్చిన వ్యాపారులు, అటవీ కాంట్రాక్టర్‌ల్లు యథేచ్ఛగా దోపిడీ సాగించడం, గిరిజనేతరులు పెద్ద ఎత్తున భూముల్ని స్వాధీనం చేసుకోవడం ఆదివాసీల సంప్రదాయ జీవన పరిస్థితిని అతలాకుతలం చేసింది.

ALSO READ: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పురుషోత్తం

వారిలో తిరుగుబాటు ఆలోచనలకు కారణమైంది. ఆదివాసీ గూడేలన్నింటినీ పర్యటించి ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన అల్లూరి మన్యం పోరాటానికి ఆదివాసీలను సమాయత్తం చేయ నారంభించాడు. ఆదివాసీ యువకులను ఎంపిక చేసుకొని సాయుధ శిక్షణ ప్రారంభిం చాడు. తాను స్వయంగా విల్లును, తుపాకిని ఉపయోగించడం నేర్చుకున్నాడు.

1922 జనవరి నుండి ఆదివాసీలు వివిధ రూపాలలో తమ ధిక్కారాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి చూపించనారంభించారు. అలా మన్య తిరుగుబాటు మొదలైంది. అల్లూరి నాయకత్వ శిక్షణలో ఆగష్టు 22న 150 మంది ఆదివాసీ గెరిల్లాలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిరచారు.

ఇదే మన్య పోరాట తొలి ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. వెనువెంటనే కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, దేవిపట్నం పోలీస్‌ స్టేషన్లను ముట్టడిరచారు.ఈ పోరాట ఘటనల అనంతరం అన్నవరం పర్యటనకు వచ్చిన అల్లూరికి ప్రజలు జేజేలు పలికారు.

మూడు సంవత్సరాల పాటు విశాఖ మన్యంలో ప్రారంభమైన పోరాటం గోదావరి మన్యం వరకూ పెద్దఎత్తున సాగింది. ఈ పోరాటాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్ర దమనకాండతో అణచివేసింది.ఈ పోరాటం ఆనాడు అణచివేయబడినా పోరాట లక్ష్యాల సాధన కోసం ఆదివాసీలు అప్పటి నుండి ఈనాటి వరకూ అనేక ఉద్యమాలు సాగిస్తునే ఉన్నారు.

నేటికీ పోడు పట్టాల కోసం ఉభయతెలుగ రాష్టాల్ల్రో గిరిజనులు పోరాడుతున్నా వారికి న్యాయం దక్కడం లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా అల్లూరుని స్ఫూర్తిగా తీసుకుని సమస్యలకు తెరదించాలి.