Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులు ఆందోళన చెందవద్దు…, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.

– రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ

ఖమ్మం బ్యూరో, మే 6,(నిజం న్యూస్)

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

శనివారం మంత్రి విడివోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లతో ధాన్య సేకరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్య సేకరణ, రవాణా పట్ల అధికారుల అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని, రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తీసుకువస్తే సేకరించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.

ALSO READ: మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడు, ముగ్గురు కొరియర్లు అరెస్టు

జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2లక్షల పై చిలుకు ధాన్యం సేకరణ కేంద్రాలు వస్తుందని అంచనా ఉందని, ఇప్పటి వరకు కేవలం 30వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగిందని మంత్రి తెలిపారు.

ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నదని, కొన్ని చోట్ల అకాల వర్షాలు కొనసాగుతుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు.

భారత ఆహార సంస్థ గోడౌన్ ల వద్ద కొంత ఆలస్యం జరుగుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఎందుకు ఆలస్యం జరుతుందని అధికారులను నిలదీశారు. గోడౌన్ ల వద్ద నిల్వ సామర్థ్య లేదని, ధాన్యం సర్దుబాటు చేయడం వల్ల ఆలస్యం జరుగుతుందని అధికారులు నివేదించారు.

అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద గల 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్ ను వినియోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ మేరకు ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి తక్షణమే జింకల తండా వద్ద గల గౌడౌన్ లో నిల్వ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. స్పందించిన జిఎం తక్షణమే అనుమతులు ఇస్తామని తెలిపారు.

రానున్న 3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలు కురవడం, పంటలు తడిసిపోవడంపై రైతులు ఆందోళనలో ఉన్నారని, వారి ధాన్యంను అమ్ముకునేందుకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారని ఆయన అన్నారు.

రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని మంత్రి రైతులకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.

వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే ప్రభుత్వంగా మా బాధ్యత అని, అందుకు అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ALSO READ: గ్రూప్-4 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్

జులై మొదటి వారంలోగా ధాన్య సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రక్రియ లో భాగస్వామ్యం అవుతున్న వారందరితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేయాలని, ఏ దశలో ఎటువంటి సమస్య వచ్చిన దృష్టికి తేవాలని ఆయన తెలిపారు.

తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి, రైతు కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ దేశానికే ఆదర్శంగా ఉహించని రీతిలో సత్ఫలితాలను అందిస్తున్నదన్నారు.

రైతుల కోసం చిత్తశుద్ధితో దృఢసంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని, ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా అకాలంగా కురుస్తున్న వడగండ్ల వానలు ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండడం బాధాకరమన్నారు.

ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని, తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించిడం జరిగిందన్నారు. వీలయినంత త్వరగా ఒక్క గింజకూడా పోకుండా వరిధాన్య సేకరణ పూర్తి చేయాలని, రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసుధన్, డిఆర్డీవో విద్యా చందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయ కుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఏసిపి గణేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫారాల మేనేజర్ సోములు, ఏఎంటి వి నర్సింహ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ పి. సునీత, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, బోయపాటి వాసు, సత్యం బాబు తదితరులు ఉన్నారు.