Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నీటిపారుద‌ల ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలి… మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 06
(నిజం న్యూస్)
నిర్మ‌ల్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్ లు, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో భాగంగా చేప‌ట్టిన ప్యాకేజీ 27 & 28 పనులతో పాటు భూసేక‌ర‌ణ‌, న‌ష్ట‌ప‌రిహారం త‌దిత‌ర ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్మల్‌ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప‌నుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శ‌నివారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్‌మాట్‌ బ్యారేజీ, చెక్‌ డ్యామ్‌ నిర్మాణాలు, చెరువుల మరమ్మత్తులు, పున‌రుద్ధరణ, సుంద‌రీక‌ర‌ణ‌ ప‌నుల‌పై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

ప్యాకేజీ-27 ద్వారా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చెరువులకు నీళ్లు అందించేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ప్యాకేజీ- 28 లో కాంట్రాక్టర్‌ ప‌నులు చేప‌ట్టక‌పోవ‌డంతో పాత టెండ‌ర్లను ఇప్ప‌టికే ర‌ద్దు చేశామ‌ని, కొత్తగా టెండ‌ర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ALSO READ: కేటీఆర్ మామ… మా అమ్మకేది ఉద్యోగ ధీమా

ప్యాకేజీ 27 & 28 ప‌నులు పూర్తైతే ల‌క్ష ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరందుతుంద‌ని పేర్కొన్నారు. స‌ద‌ర్మాట్ బ్యారేజ్ గేట్ల బిగింపు ప్రక్రియను మ‌రింత వేగ‌వంతం చేసి, జూన్ నెల‌ఖారు వ‌ర‌కు ప‌నులు పూర్త‌య్యేలా చూడాల‌న్నారు.

అంతేకాకుండా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, సుంద‌రీక‌ర‌ణ‌, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్‌ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులను త్వ‌ర‌తిగ‌తిన పూర్తి చేయాల‌ని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ వేగవంతం అయ్యేలా చూడాల‌న్నారు. సుందరీకరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా పని చేయాల‌ని సూచించారు.
ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నీటిపారుద‌ల శాఖ, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖల అధికారులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.