Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వం మెడలు వంచైనా గిట్టుబాటు ధర ఇప్పిస్తా

*మండపేట తెలుగు దేశం పార్టీ గడ్డ
*రైతుల కోసం వచ్చాను
*రాజకీయాలు మాట్లాడను
*ఇది రైతు దగా ప్రభుత్వం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 5,(నిజం న్యూస్) బ్యూరో : మండపేట: రైతులను దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలతో పాటు రైతాంగం మోకాలి లోతు నీళ్ళల్లో మునిగిపోతే ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు.

తాను రైతులకు అండగా నిలవడానికి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చానని రైతులకు న్యాయం జరిగే వరకూ వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనే డిమాండ్ తో పర్యటన చేపట్టిన చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మండపేట విచ్చేశారు.

రావులపాలెం జొన్నాడ ఆలమూరు రోడ్డు మార్గం గుండా ఆయన రోడ్ షో నిర్వహించి మండపేటలో ఆగారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాబు రాకతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోలాహలంతో కలువపువ్వు సెంటర్ కిక్కిరిసింది. అంతకు ముందు ఎమ్మెల్యే వేగుళ్ల రాత్రి సమయం కావడంతో ఫ్లడ్ లైట్లు, పార్టీ బ్యానర్ లతో సెంటర్ కు పసుపు కళ రప్పించారు.
చంద్రబాబు తన కాన్వాయ్ నుండే రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ చంద్రబాబు కాన్వాయ్ దగ్గరకు వెళ్ళి ఈ ప్రాంతంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతు పరిస్థితులను వివరించారు. ఆయనతో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి , టీడీపీ నాయకుడు మల్లిపూడి గనేశ్వరరావు, పట్టణ రైతులు బాబుకు పలు విషయాలు విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకూ రైతు పక్షాన నిలబడి అండగా ఉంటానన్నారు.

ALSO READ: మహిళా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో స్నేహం…59 ఏళ్ల శాస్త్రవేత్త అరెస్టు

ఈ జిల్లాలో వర్షాల కారణంగా రైతాంగం కుదేలై దిక్కు తోచని స్థితిలో ఉంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ద్వజమెత్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలతో దెబ్బ తిన్న పంటలతో రైతులను చూస్తుంటే తనను కంటతడి పెట్టించిందని ఆవేదన చెందారు.

రాష్ట్ర మంత్రుల దగ్గర నుండి సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ వరకూ ఈ జిల్లాలో ఉండి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా దగా చేసిందని మండి పడ్డారు. అకాల వర్షాలతో జిల్లాలో వరి పంటలు వేసిన రైతులు చితికి పోయారని వారిని ఈ సైకో ప్రభుత్వం ఎక్కడా పటించుకున్న దాఖలాలు లేవని ఎద్దేవా చేసారు. 1996 లో హరికేన్ తుఫాన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసిందన్నారు.

ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న తాను పరిస్థితి తెలియగానే వెంటనే జిల్లాకు రావాలని సంకల్పించానని ఆన్నారు. అయితే నేరుగా జిల్లాకు రావాలని అనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించడం లేదని భద్రతా సిబ్బంది చెప్పారన్నారు. అయినా గానీ ఎట్టి పరిస్థితిలో వెళ్లాలని ఆర్మీ వారికి చెప్పానని అలాగే ఫైలెట్ ను బలవంతంగా ఒప్పించి రాజమండ్రిలో దిగానని చెప్పారు. అక్కడ నుండి హెలికాప్టర్ లో నేరుగా ముమ్మిడివరంలో దిగి అక్కడి ప్రజలను కలిసిన అనంతరం మండపేట వచ్చానని తెలిపారు.

మండపేటలో హెలిపేడ్ లేకపోవడంతో జోగేశ్వరరావు రైస్ మిల్లులో దిగడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు గానీ జోగేశ్వరరావు అప్పుడు సాధారణ వ్యక్తి అన్నారు. ఆ సమయంలో తాను రాజమండ్రిని సెక్రటేరియట్ చేసి హైదరాబాద్ లో ఉండే మొత్తం ఐఏఎస్ అధికారులను లను ఇక్కడకు రప్పించి తూర్పు గోదావరిని పూర్తిగా బాగు చేసిన తర్వాతే తిరిగి హైదరాబాద్ కు వెళ్లానని గుర్తు చేశారు. అదీ నా పట్టుదల అని బాబు ప్రజలకు తెలియజేశారు. ఆ తర్వాత 2014లో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖ పట్టణాన్ని అల్లకల్లోలం చేసిందన్నారు.

ALSO READ: వైద్యారోగ్య శాఖలో 1331 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్

అప్పుడు కూడా నెల రోజులపాటు విశాఖ లోనే ఉండి విశాఖ నగరాన్ని యథా స్థానానికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆ సమయంలో తనను పట్టుకుని బాబు ఏం చేస్తాడని విమర్శించిన వాళ్ళకి హుదూద్ ముందు హుదూద్ వెళ్ళాక విశాఖను చూసుకుంటే తాను ఏం చేశానో అర్థమౌతుందని పేర్కొన్నారు.

విశాఖలో తూఫాన్ వచ్చినప్పుడు ఏనాడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

నేడు రైతులు పండించిన వరి ధాన్యం 75 కేజీల ఒక్కంటికీ రూ 1530 లు గిట్టుబాటు ధర కావాలన్నారు. ఏరోజైనా ఈ ప్రభుత్వం ఆ విధంగా గిట్టుబాటు ధర కల్పించిందా అని రైతులను అడిగారు. బస్తాకు 800 నుండి 900 రూపాయలకు ఏనాడూ పెంచి ఇవ్వలేదన్నారు.

అదీ కూడా ఏవో కుంటి సాకులు పెట్టి రూ 50 నుంచి 100 కు కటింగ్ చేస్తున్నారన్నారు. ఇది సరిపోదు అన్నట్టు హమాలీ చార్జీలు, ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా రైతు నెత్తిమీదే రుద్దడం ఈ ప్రభుత్వానికి అలవాటై పోయిందని తూర్పార పట్టారు. బీసీ మంత్రి ఇక్కడే ఉన్నారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ ఇక్కడే ఉన్నారు.

ఈ ఇద్దరూ కలిసి రైతులను దగా చేశారని నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి తిరిగానని, తరవాత జిల్లాకు వచ్చానని రేపు కూడా జిల్లాలోనే ఉంటానని చెప్పారు. రైతును బాధ పెట్టిన ప్రభుత్వం నిలబడదన్నారు. కరోనా సమయంలో ఐటీ కంపెనీలు, ఫ్యాక్టరీలు, పాఠశాలలతో పాటు గ్రామాలు గ్రామాలు బంద్ చేశాయన్నారు.

కానీ ఒక్క రైతు మాత్రమే విశ్రమించకుండా పంటలు పండించి అన్నం పెట్టిన రైతన్నగా మిగిలిపోయారని పేర్కొన్నారు. వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టిన ఘనత ఒక్క రైతన్నకే దక్కుతుందని కొనియాడారు. దేశానికి తిండి పెట్టిన రైతన్న నేడు ప్రభుత్వం చేసిన పనికి ఉరి వేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. రైతు గానీ, కౌలు రైతులు గానీ ఇద్దరూ దెబ్బ తినే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క రైతు దిగాలు చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. నేను అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని రైతుల్లో జోష్ నింపారు.

ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ అండగా ఉంటానని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. నేనొస్తున్నాని తెలియగానే ఆదరబాదర లారీలు పంపించారని యంత్రాంగాన్ని పంపించారని అన్నారు. రామచంద్రాపురం పోతున్నా నంటే అక్కడ కూడా పని చేస్తున్నారని రేపు ఉదయం ఎక్కడికి పోయేది చెప్పనని తప్పకుండా రైతుకు అండగా నిలవడానికి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తానని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరగాలన్నారు.
మండపేట ఎప్పుడూ కూడా తెలుగు దేశం గడ్డే నన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యలపై పోరాటం చేసే నాయకుడని ఎమ్మెల్యే వేగుళ్లను ప్రశంసించారు. నియోజక వర్గ ప్రజలంతా ఆయనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని రైతుల కోసం వచ్చానని వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని తన ప్రసంగాన్ని ముగించి రామచంద్రపురం బయలు దేరి వెళ్లారు.
చంద్రబాబు పర్యటనలో అపశృతి..
చంద్రబాబు నాయుడు మండపేట రోడ్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. రోడ్ షో అనంతరం కాన్వాయి కదులుతున్న సమయంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఉంగరాల రాంబాబు ఆయనకు కండువా వేయడానికి వెళ్తుండగా కాన్వాయ్ ముందుకు జరిగింది.

అదే సమయంలో వెనుక నుంచి తోపులాట జరగడంతో చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న వాహనం ముందు టైరు రాంబాబు పాదం పైనుంచి వెళ్లిపోయింది. పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి చూసి ఆయనను పక్కకు తీసుకువెల్లిపోయారు. కాలికి షూష్‌ ఉండటంతో పెద్దగా గాయం కాలేదని తెలిపారు. చికిత్స నిమిత్తం పార్టీ నాయకులు ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లారు.