తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటం
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి !
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని..నివేదికలు తెప్పించాలని సిఎం కెసిఆర్ అధికారులును ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరలకే కొంటామని చెప్పారు.
రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినా రైతుల్లో భరోసా దక్కడం లేదు.
ఎందుకంటే తొలివిడతలో నష్టపోయిన వారికే ఇప్పటి వరకు ఎక్కడా డబ్బుల పంపిణీ జరిగినట్లు చెప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి…నష్టం అంచనా వేసే ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు ఇరు రాష్టాల్ల్రో ముందుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
వరి, మక్క,జొన్న తదితర పంటలను తోణమే కొనుగోలు చేయాలి. ధాన్యం సేకరణలో తడిసిన ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అవసరమైతే నిబంధనలు సడలించి తక్షణమే సేకరణ ప్రారంభించాలి. కల్లాల నిండా నీళ్లు.. రైతుల కంట కన్నీళ్లు.. అన్నచందంగా తెలుగు రాష్టాల్ర రైతుల పరిస్థితి తయారయ్యింది.
ALSO READ: కళ్ళం లో ధాన్యం.. అన్నదాత కళ్లల్లో దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయి. చేతికందిన పంటలను దారుణంగా దెబ్బతీశాయి. అటు నేలవాలిన పంటలు, ఇటు ధాన్యం కుప్పల్లో వస్తున్న మొలకలు చూసి రైతాంగం ఆందోళన చెందుతున్నది. వీరిని ఆదుకుంటా మని కేంద్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఆదుకుంటా మని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
ధాన్యం కొనుగోళ్లు కూడా వేగవంతం చేయాలని సిఎంలు ఆదేశించారు. కష్టకాలంలో అన్నదాతలకు అండగా నిలిచారు. రైతులు ఏమాత్రం ఆందోళనకు గురికావొ ద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని ప్రకటించారు. తద్వారా తమది రైతు ప్రభుత్వమని మరోసారి చాటి చెప్పారు. అయితే సాయం అందితేనే రైతుల్లో భరోసా దక్కేది. ఇప్పుడు నష్ట పరిహారం అందాలి. పంటలను కోనుగోలు చేయించాలి. మళ్లీ తదుపరి పంటలకు సిద్దపడాలి. అప్పుడే రైతులకు కంటినిండా కునుకు పట్టేది. కానీ కల్లాల్లో నీళ్లు వారిని కదలనీయడం లేదు.
మళ్లీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండు వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేశాయి. చేతికి వచ్చిన పంటను రేపోమాపో అమ్ముకుందా మనుకునే లోపే వడగండ్ల వానలు నిండా ముంచాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు కన్నీరే మిగిలింది. ఈ దుస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచారు.
ALSO READ: OTT లో ఏజెంట్
రైతును ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆందోళనతో ఉన్న కర్షకులకు ఒకింత ఊరట కలిగింది. మరోవైపు, కొనుగోళ్ల పక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇప్పటికే జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద సంఖ్యలో ప్రారంభమయ్యాయి. ఆరుగాలం పడిన శ్రమ వర్షార్పణమైందని ఆందోళనలో ఉన్న రైతాంగానికి ముఖ్యమంత్రి తాజా ప్రకటన భారీ ఊరటను కల్పించినా..కార్యాచరణ మాత్రం మొదలు కాలేదు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రులు మండిపడుతున్నారు.
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో మంత్రులు, బిజెపి, కాంగ్రెస్ నాయకులు పర్యటించి రైతులను ఓదార్చారు. వడ్ల గింజలు రాలిపోవడం మూలంగా హార్వెస్టింగ్ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తడిసిన ధాన్యం విషయంలో మాత్రం ఎలాంటి సాకులు చెప్పకుండా ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సుముఖంగా ఉందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
ALSO READ: కోయంబత్తూరు లో వైట్ కోబ్రా
రైతుపేరిట రాజకీయం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఒకడుగు ముందే ఉంటుందని విమర్శలు చేశారు. అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లితే రైతాంగాన్ని ఆదుకోవాలన్నది అందరి సంకల్పం అయినా ఎంత త్వరగా కార్యక్రమం చేపట్టార న్నది కూడా ముఖ్యమే.
చాలా చోట్ల వరికోతకు ముందే చేతికొచ్చిన పంట నేల రాలింది. కొన్ని చోట్ల కోసిన వరి ధాన్యం కుప్పలన్ని వరదలో కొట్టుకుపోవడం, తడిసి ముద్దవ్వడంతో రైతులు లబోదిబోమనే దుస్థితి ఏర్పడిరది. మరోవైపు తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ అధికారులు అంచనాల్లో ఉన్నారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం కొనుగోలుకు తక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు అండగా నిలవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలతో 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. అన్నదాతలకు అండగా నిలవడంలో సిఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు.
వర్షాలపై ముందస్తు సమాచారం, తగు ఏర్పాట్లు ప్రభుత్వం చేయక పోవడంతో రైతులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.20 వేలు, మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, పిడుగుపాటుకు మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
దెబ్బతిన్న, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. రైతులకు తగినన్ని నాణ్యమైన గోనె సంచులు సరఫరా చేయాలని, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం అరికట్టాలన్నారు.
ఇదే తరహాలో అన్ని పార్టీల కార్యకర్తలను గ్రామాలకు తరలించి సమాచారం సేకరించాలి. రైతుల వద్దకు వెళ్లి తడిసిన ధాన్యం మార్కెట్ యార్డులకు తీసుకుని వెళ్లి అమ్మించేలా అన్ని పార్టీల నేతలు తమ కార్యకర్తలను ఆదేశించాలి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.