కళ్ళం లో ధాన్యం.. అన్నదాత కళ్లల్లో దైన్యం
*ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షాలు ముంచెత్తాయి అన్నదాతను కుదేలు చేశాయి.
*అకాల వర్షాలతో కౌలు రైతుకి ఇక కన్నీల్లే మిగులు
*జిల్లా అంతటా చాపలా పర్చుకున్న వరి దుబ్బులు
*కౌలు రైతులకు దక్కని పంట నష్టపరిహారం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 2,(నిజం న్యూస్) బ్యూరో:
ఉభయ గోదావరి జిల్లాలు పాడిపంటలకు నెలవు. తరుచుగా పకృతి వైపరీత్యాల రీత్యా ఒకోసారి పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. దాని నుంచి తప్పించుకునే మార్గం అన్నదాతకు తెలియడం లేదు.
ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు అకాల వర్షాలకు రైతన్న దొరికిపోతూనే ఉన్నాడు. గత 2 రోజులుగా అకాల వర్షాలు అంబేత్కర్ కోనసీమ జిల్లాతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలనూ అతలాకుతలం చేశాయి.
అన్నదాతలు చిగురుటాకులా వణికిపోతున్నారు.వారి ఆశలపై చన్నీళ్లు కుమ్మరించింది. అకాల వర్షం చేతికి అందొచ్చిన వరిపంటను మట్టిపాలు చేసింది. ఈ వర్షానికి వరి కోతలు పూర్తి చేసిన రైతన్నలతో పాటు, కొయ్యని రైతన్నలూ దొరికిపోయారు. కోతలు కోసిన వరి పంట ధాన్యాన్ని ఆదరాబాదరాగా కళ్ళాల్లోనూ, రహదారుల పక్కన, రాశులు చేసి బరకాలు కప్పి ఉంచడంతో అవి కాస్తా తడిసి ముద్దయ్యాయి.
ALSO READ: ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల అవినీతి
అకాల వర్షానికి కోత కొయ్యని అన్నదాతలు సైతం మట్టికరిచారు. జిల్లా వ్యాప్తంగా పండిన పంట గాలికి నేలంటి వరి కంకులతోచాపలా తయారైంది. పండిన చేను చేతికి అందకుండా మొక్కలు మొలిచేస్తోంది. అకాల వర్షాలకు పంటలు నష్టపో వడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పంట నష్టం గాని, ఫసల్ బీమా గాని నేరుగా పొలం గల రైతుల ఖాతాల్లోనే జమవుతున్నాయి గాని, పెట్టుబడి పెట్టి పంట పండించిన కౌలుదారునికి దక్కడం లేదని పలువురు కౌలురైతులు వాపోతున్నారు.
పంట నష్టపరిహారం కౌలుదారునికి దక్కకపోతే రాష్ట్రవ్యాప్తంగా అడుగడుగునా కౌలు రైతుల ఆత్మహత్యలే కనబడతాయని కౌలు రైతులు పలువురు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించి పంట పండిస్తున్న కౌలు రైతులకే ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారంగాని, పంట బీమాగాని అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కౌలు రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం భూమి గల రైతుల ఖాతాలకే నేరుగా సొమ్ములు వేయడం వల్ల తమ ఖాతాల్లోకి డబ్బులు వచ్చినా, రైతులు మళ్ళీ కౌలుదారుల నుంచి మగతాను కూడ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల కౌలు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.