Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అరిగి పోయిన రికార్డ్ ఎన్నిసార్లు వేస్తావ్…

ధైర్యం ఉంటే భూ అక్రమాలపై ఏ విచారణైనా చేయించు

దానికి మేము సహకరిస్తాం.. మా ప్రమేయం ఉంటే దేనికైనా సిద్ధం

మా ప్రభుత్వంతో పాటు, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటి మీద కూడా విచారణ చేయించు

కలెక్టర్ గారికి మేము కూడా విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం

భూ అక్రమాల ఆరోపణలపై మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్

రాప్తాడు మే 02 (నిజం న్యూస్)

ఎన్నిసార్లు చెప్పిందే చెబుతావ్.. ప్రభుత్వం మీది.. అధికారులు మీ చేతుల్లో ఉన్నారు.. భూ అక్రమాలు జరిగి ఉంటే విచారణ చేయించు అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.

అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి, కురుగుంట, రాచానపల్లి, సోములదొడ్డి, ఇటుకలపల్లి, అక్కంపల్లి, కొడిమి పొలాల్లోని సర్వే నంబర్లలో టీడీపీ హయంలో వేలాది మందికి ఫేక్ పట్టాలిచ్చారని ఆరోపిస్తున్నారు.

ఇదే అంశం మీద త్వరితగతిన విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేయించాలని జిల్లా కలెక్టర్ ను కలసి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు.

ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఫేక్ పట్టాలిచ్చామని బురద చల్లడం కాదని.. ధైర్యం ఉంటే నిరూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వాస్తవంగా నకిలీ పట్టాలిచ్చి ఉంటే.. నాలుగేళ్లుగా ఏమి చేస్తున్నావని సునీత ప్రశ్నించారు.

ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదే కదా.. విచారణ చేయించుకో ఎవరు వద్దన్నారని నిలదీశారు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నావ్.. అవసరమైతే సీబీఐ చేత కూడా విచారణ చేయించుకో.. మేము కూడా సహకరిస్తామని సునీత స్పష్టం చేశారు.

ALSO READ: 4న డిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభo

అధికారులకు సహకరించేందుకు మండలంలో ఉన్న మా కన్వీనర్లు కూడా వస్తారన్నారు. అది మానేసి ప్రతి సారి పరిటాల సునీత హయాంలో ఫేక్ పట్టాలిచ్చారంటూ ఆరోపణలు చేస్తూ బురద చల్లే పనిలో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలు, అలాగే మీ ప్రభుత్వ హయాంలోని ఈ నాలుగేళ్లలో జరిగిన భూ అక్రమాలు, ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుగా చెబుతున్న పట్టాల మీద కూడా విచారణ చేయించాలని సవాల్ విసిరారు.

జిల్లా కలెక్టర్ గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నామని.. అనంతపురం రూరల్ పరిధిలో ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్న వాటిపై విచారణ చేయించాలన్నారు.

ఇందులో మా తప్పు ఉందని తేలితే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చేయాల్సిన పని వదిలేసి.. 24గంటలు పరిటాల కుటుంబం మీద పడి ఏడవటం మానేయాలని సూచించారు.