రేపటి నుండి రోడ్డెక్కనున్న హైదరాబాద్ అన్ని డిపోల సిటీ బస్సులు
హైదరాబాద్ నగరవాసులకు ఇకపై రవాణా సమస్యలు తొలగిపోనున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని డిపోలకు చెందిన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కుతున్నాయి. 185రోజులుగా డిపోల్లోనే ఉన్న 3వేల 200సిటీ బస్సుల్ని తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు అందుబాటులోకి తేనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగూణంగా…ప్రత్యేక ఏర్పాట్లు చేసి…సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో సిటీ బస్సులు ప్రారంభించిన ఆర్టీసీ…రేపటి నుంచి జంటనగరాల వ్యాప్తంగా అన్ని రూట్లలో పూర్తిస్థాయిలో బస్సులు నడపనుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్నెల్ల క్రితం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోలు మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా జిల్లాల వ్యాప్తంగా ఆర్టీసీ పునరుద్ధరణ జరిగింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లాలో బస్సులు నడుపుతూ వస్తోంది. గ్రేటర్‌లో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని సిటీ బస్సుల్ని తిప్పేందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో ఇంతకాలం వేచి చూసింది.
మహానగరంలో అన్ని వ్యవస్థలో ప్రజలకు అందుబాటులోకి రావడంతో…ఆర్టీసీ కూడా ఆదిశగా అడుగులు వేస్తోంది. మెట్రో రైల్ సేవలు కూడా ప్రారంభం కావడంతో 200పైగా ఉన్న సిటీ బస్సులను నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది ఆర్టీసీ. డ్రైవర్లు ,కండక్టర్‌లకు ప్రయాణికులతో ఏవిధంగా ఉండాలనే దానిపైన పూర్తి శిక్షణతో పాటు సూచనలిచ్చి రంగంలోకి దించింది.
కరోనా కేసుల తీవ్రత తగ్గడం, నగరపౌరుల్లో వైరస్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ, అవగాహన పెరగడంతో ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించి ముందుకెళ్తోంది. అయితే స్కూల్స్, కాలేజీలు పూర్తిస్థాయిలో తెరుచుకుంటే… ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.