Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బొండాలకు తప్పని గండాలు

తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం )
మే1, నిజం న్యూస్..

తూర్పుగోదావరి జిల్లా పాడి పంటలకు పెట్టింది పేరు. అటువంటి అన్నపూర్ణ గా విలసిల్లే తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాత విలవిలలాడుతున్నాడు.
దాళ్వా సీజన్లో సాధారణంగా రైతాంగం బొండాలుగా వ్యవహరించే ఎం.టి.యు 3626 (ప్రభాత్ )వంగడం వైపు మొగ్గు చూపుతారు.ఈ రకానికి మార్కెట్ నందు ధర పలకడం, అలాగే దిగుబడి ఆశాజనకంగా ఉండడం వల్ల రైతులు బొండాలు తమను ఒడ్డుకు చేర్చే కల్పతరువులా భావిస్తారు.

అయితే అధికారులు ఈ వంగడం వద్దని ప్రకటన చేసినప్పటికీ గతములో దాళ్వా సీజన్ ముందు ఈ తరహా ప్రకటనలు వచ్చిన,తీరా చూస్తే బొండాలుకే అధిక ధర మార్కెట్ నందు రావడంతో ఈ సారి కూడా రైతులు అధికశాతం బొండాలు పండించారు.

ALSO READ: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత

ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం తరపున బొండాలు మద్దతు ధరకు కొంటామని ప్రకటించిన నేపథ్యంలో రైతాంగం గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న సందర్బంలో ఈ ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా అమలులోకి రాకపోవడం శోచనీయం.

పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో బొండాలు ధాన్యం సి.ఎం.ఆర్ పద్దతిలో మద్దతు ధరకు కొనుగోలు జరుగుతుండగా తూర్పుగోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో తమకు బొండాలు ధాన్యం కొనుగోలుపై అధికారుల నుండి ఆదేశాలు లేవని నిక్కచ్చిగా చెప్పుతున్నారు.

ఈ పరిస్థితి చూసి రైతాంగం విస్తూపోతున్నారు. ఒక్కొక జిల్లాకి ఒక్కొక్క నిబంధనలు ఏంటి? అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.గోరు చుట్టుపై రోకలి పోటులా అకాల వర్షాలు రైతులను తీవ్రమనోవేదనకు గురి చేస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు మీనామేషాలు లెక్కించడంమాని పక్క జిల్లాల మాదిరిగా తమ వద్ద బొండాలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కళ్ళంలో ధాన్యం, కళ్ళలో దైన్యం నింపుకున్న రైతాంగం అధికారులను డిమాండ్ చేస్తున్నారు.