బుర్జ్‌ఖలీఫా పై కేకేఆర్ ఆటగాళ్ల ఫొటోలు!!

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరుకు అబుదాబి వేదిక సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది ముంబై.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా తొలి మ్యాచ్‌లోనే గెలిచి జట్టులో ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది .బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా తలపడనుంది. ఈ నేపథ్యంలో సీజన్ తొలి మ్యాచ్ ఆడుతున్న కేకేఆర్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫా ఎల్ఈడీ లైట్లతో ఘన స్వాగతం పలికింది. బుర్జ్‌ఖలీఫా కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ రంగులతో ధగధగలాడింది. పర్పుల్, గోల్డ్ కలర్లతో ఫ్రాంఛైజీ లోగోతో పాటు ఆటగాళ్ల ఫొటోలను కూడా భవనంపై ప్రదర్శించింది. కేకేఆర్ జెర్సీ కలర్లలో బుర్జ్ఖలీఫాను విద్యుద్దీపాలతో అలకరించడంపై ఆ జట్టు ఫ్రాంఛైజీ ట్విటర్లో ధన్యవాదాలు చెప్పింది. రాత్రివేళ యూఈలో అద్భుత స్వాగతం లభించిందని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటవైరల్ అయింది. కేకేఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాపై ముంబైదే ఆధిపత్యం. ఐపీఎల్ లీగ్‌లో ఈ రెండు జట్లు 25 సార్లు తలపడ్డాయి. ముంబై 19 సార్లు విజయం సాధించింది. కోల్‌కతా కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసింది. అయితే 2014లో ఇదే వేదిక మీద జరిగిన మ్యాచ్‌లో ముంబైని కోల్‌కతా ఓడించింది. ఇది కేకేఆర్ జట్టుకు సానుకూలాంశం. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గత నాలుగు మ్యాచుల్లోనూ టాస్ గెలిచిన కెప్టెన్లు ఛేదనకే మొగ్గు చూపించడం గమనార్హం.