Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు

వ్యవసాయ పంపు సెట్లకు విూటర్లు
అన్ని జిల్లాల్లో స్మార్ట్‌ విూటర్ల బిగింపు
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న విపక్షం
అమరావతి,ఏప్రిల్‌27: రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ విూటర్లను బిగించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్‌ విూటర్ల బిగింపునకు అవకాశంలేని చోట ఇన్ఫార్రెడ్‌ సమాచార ప్రామాణికం కలిగిన విూటర్లను ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ విూటర్ల బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును తొలుత రైతులే భరించాలని, ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎపిలో ఉచిత విద్యుత్‌ ఇస్తూనే విూటర్లను పెట్టే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. విజయనగరంలో ఈ పథకం విజయవంతం అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది.

ALSO READ: పుష్ప- 2 లో ఎన్టీఆర్ అతిధి పాత్రలో…

విూటర్ల బిగింపు వల్ల మంచి ఫలితాలు సాధించామని సిఎం జగన్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. అంతేగాకుండా విద్యుత్‌ ఆదా అయ్యిందని గుర్తించామని అన్నారు. ఈ క్రమంలో మిగతా జిల్లాల్లో కూడా దీనిని విస్తరించే పని జరుగుతోంది.

విద్యుత్‌ ఉచితం అంటూనే రైతులపై అదనపు భారాన్ని మోపబోతోందన్న విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇకపై వ్యవసాయ విద్యుత్‌ బిల్లులను రైతులు తమ జేబుల నుంచే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోందన్న ప్రచారం సాగుతోంది.
దీనికోసం ప్రత్యేకంగా రైతుల పేరుతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాలో కొత్తగా తెచ్చిన సంస్కరణలపై ఇంధన శాఖ కార్యదర్శి మార్గదర్శకాలను విడుదల చేశారు.

ప్రత్యేకంగా ఏపీ హరిత ఇంధన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ విూటర్ల ద్వారా ప్రతి నెలా వచ్చే బిల్లును తామే చెల్లిస్తామని జీఓలో వెల్లడిరచారు. ఇలా వెల్లడిస్తూనే, మరోప్రక్క వ్యవసాయ పంపుసెట్లు ఏ నెలలో ఎంతెంత కరెంటు కాల్చుకొనే అవకాశం వుందో ప్రభుత్వం లెక్కగట్టింది.

ఆ అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్న పంపు సెట్లు ఏడాదికి 12 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వాడే అవకాశం వుందని, ఆ విధంగా ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, ఆ మొత్తాన్ని నెలవారీగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుందని జీఓలో వెల్లడిరచారు. కానీ అంతకుమించి వాడకం పెరిగితే ఆ భారం ఎవరు భరించాలన్నది మాత్రం చెప్పడంలేదు.

ALSO READ: దేశంలో ఉచిత విద్యుత్‌ సాధ్యమా ?

అసలు విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్తులో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తుందనే గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా సాఫీగా అమలవుతున్న ఉచిత విద్యుత్తు పథకానికి కొర్రీలు వెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

ప్రైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు బిగిస్తున్నారని ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రయివేటీకరణ చేసేందుకే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ విధానం తెస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే విద్యుత్‌ సంస్కరణలను పటిష్టంగా అమలు చేస్తున్న తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని సలహాదారు ఒకరు కితాబు కూడా ఇచ్చారు. దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను జగన్‌ సర్కార్‌ ఏమాత్రం వ్యతిరేకించకుండా వేగంగా అమలు చేస్తోందని అవగతమవుతోంది.

నగదు బదిలీ పథకాన్ని డిసెంబరులోగా అమలు చేయాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్‌ నుంచే అమలు చేయాలని నిర్ణయించి, అందుకు శ్రీ కాకుళం జిల్లాను ఎంపిక చేసింది. విూటర్ల బిగింపునకు ఎందుకు పరుగులు పెడుతుందో అర్థం కావడం లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు.

పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు బదిలీ పథకాన్ని తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం భుజానికెత్తుకుందని మండిపడ్డారు. అదనపు అప్పుకోసం కేంద్రం ఆడమన్నట్లల్లా ఆడుతూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధం కావడం అన్యాయం. ఇలాంటి చర్యలతో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పం నెరవేరుతుందా అన్నది ఆలోచన చేయాలని అన్నారు.

ALSO READ: ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి… ఈటల

ఒక పక్క తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానంటూ, వైఎస్‌ పేరుతో రైతు దినోత్సవాలు జరుపుతూ, మరో పక్క ఆయన అమలుచేసిన ఉచిత విద్యుత్తు పథకానికి తనయుడు జగన్మోహన్‌ తూట్లు పొడవడం రైతులను మోసం చెయ్యడం కాదా అని అన్నారు. ఉచిత విద్యుత్తుకు స్వస్తి చెప్పే చర్యల్ని పరోక్షంగా అమలు చేస్తూ విూటర్లు బిగించడం పేరిట ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఉచిత విద్యుత్‌ బిల్లుల్నిఆయా సంస్థలకు ఎందుకు చెల్లించకూడదన్నారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం మున్ముందు ఉచిత విద్యుత్తు బిల్లులు మాత్రం చెల్లిస్తుందన్న నమ్మకం ఏమిటన్నారు.

ఒకసారి విూటరు బిగించి యూనిట్లు ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలు పెడితే అది తమ మెడకు గుది బండ అవుతుందని రైతులు చేస్తున్న ఆందోళనలకు సమాధానం చెప్పాలన్నారు.