Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉనికిని కోల్పోతున్న స్వతంత్ర సంస్థలు.

మంచిర్యాల జిల్లా ప్రతినిది ఏప్రిల్ 28 (నిజం న్యూస్) మంచిర్యాల

ప్రతినిదిసాధారణ పౌరులకు సమస్య ఎదురైనప్పుడు ఏ దిక్కూ లేని పరిస్థితుల్లో న్యాయం కోసం ఆశ్రయించే స్వతంత్ర సంస్థలు.. తమ ఉనికినే కోల్పోతున్నాయి. సామాన్యులకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరిగినా, అపాయం పొంచి ఉన్నా తామున్నామని భరోసానివ్వాల్సిన కమిషన్లు.. నియామకాలకు నోచుకోక వెలవెలబోతున్నాయి.

నెలలు, ఏళ్ల తరబడి ఆయా కమిషన్లను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడమే ఇందుకు కారణం. కమిషన్ల చైర్మన్‌, సభ్యుల పదవీకాలం ముగిసినా.. పునరుద్ధరణ చేపట్టకపోవడంతో అవి ఖాళీ కమిషన్లుగా ఉండిపోతున్నాయి.

దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలువస్తున్నాయి. సాధారణంగా పౌరుల హక్కులకు భంగం కలిగినా, అధికారులు, ప్రత్యర్థుల నుంచి అపాయం పొంచి ఉన్నా బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా హక్కుల కమిషన్‌.. చైర్మన్‌, సభ్యులు లేకుండా స్తబ్దంగా మిగిలిపోయింది.

రాష్ట్ర సమాచార కమిషన్‌ గడువు గత ఫిబ్రవరిలో ముగిసినా.. పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడి పదవీ విరమణ తర్వాత సీనియర్‌ సభ్యుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.

ALSO READ: మున్సిపల్ అవిశ్వాసం పై సందిగ్ధం వీడేనా?

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చుక్క నీరు లేని నావగా మారింది. దాదాపు నాలుగు నెలలుగా హెచ్చార్సీ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. చైర్మన్‌, సభ్యుల పదవీకాలం గత డిసెంబరులో ముగియడంతో.. అప్పటినుంచి హెచ్చార్సీ పనితీరు నెమ్మదించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర హెచ్చార్సీ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రయ్యను 2019 డిసెంబరు 23 ప్రభుత్వం నియమించింది.

ఆయన మూడేళ్ల పదవీకాలం 2022 డిసెంబరు 22తో ముగిసింది. కమిషన్‌ సభ్యులపదవీకాలం కూడా ముగిసింది. దీంతో అప్పటినుంచి అన్ని కుర్చీలూ ఖాళీగానే ఉన్నాయి. రెండు నెలలుగా దాఖలైన పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ అధికారుల వేధింపులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలపై రాష్ట్రంలోని నలు మూలల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు న్యాయం కోసం హెచ్చార్సీని ఆశ్రయిస్తుంటారు.

సగటున రోజుకు 30 పిటిషన్లు హెచ్చార్సీలో దాఖలవుతాయి. అవన్నీ ఇప్పుడు విచారణ లేకుండా మిగిలిపోయాయి. కాగా, హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యతోపాటు సభ్యుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.