Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కప్పలతక్కెడ లాంటి కాంగ్రెస్‌ను కాపాడడం ఎవరి తరం కాదు..?

కాంగ్రెస్‌ను కట్టి పడేస్తున్న గ్రూపులు
సీనియర్లలో అనైక్యతే అసలు సమస్య
ప్రజాదరణ ఉన్నా కొట్టుకు చావడం వారి నైజం
హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్‌ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు.

ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది పోయి అంతరించే దశకు చేరుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే అంతా ఒక్కతాటిపైకి వచ్చి నడుస్తున్నారనుకునే లోగా.. పార్టీలో మల్లీ చిచ్చు మొదలయ్యింది.

రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు జట్టుకట్టి పాతవిధానంలోనే నడుస్తున్నారు. లోపల విభేదాలు ఉన్నా గతేడాది రాహుల్‌ సభ కోసం అంతా కలసికట్టుగా ముందుకు సాగారు. వరంగల్‌ సభను విజయవంతం చేసారు. ఈ క్రమంలో పూర్వ వైభవం కోసం శ్రేణులకు పార్టీ దిశా నిర్దేశం చేసింది. పిసిసి చీఫ్‌గా రేవంత్‌ నియమితులు అయ్యాక పార్టీకి మళ్లీ కొంత ఊపిరి వచ్చినట్లుగా అంతా భ్రమించారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని నాశనం చేస్తున్నదని చెప్పాలి.

ALSO READ: ప్రధాని ఎవరన్న చర్చ…విపక్షాల్లో ఐక్యత కానరాని ఐక్యత

పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. సీనియర్‌.. జూనియర్‌ రాజకీయం కారణంగా ఆ పార్టీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నది. ముందు ఇంటిని సర్దుకోలేని పార్టీ రాష్ట్రంలో ఏవిూ రాణిస్తుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ స్థానాన్ని ప్రస్తుతం బీజేపీ భర్తీ చేస్తున్నది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు పొందింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను దక్కించుకున్నది. అనంతరం అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వేసిన వ్యూహంలో ఆ పార్టీ చిక్కిపోయింది. ఎన్నికైన వారంతగా మెల్లగా గులాబీ దళంలో చేరిపోయారు. ఆ తరవాత ఏ ఎన్నికలు వచ్చినా నామ మాత్రపు విజయాలు కూడా సాధించలేక పోయింది.

మునుగోడులో డిపాజిట్‌ కూడా దక్కలేదు. కనీసం డిపాజిట్‌ అయినా కాపాడుకోలేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వీటన్నింటికీ ప్రధాన కారణం పార్టీని గాడిన పెట్టే నాయకుడు లేకపోవడం. దీనికి తోడు నాయకుల స్వయంకృతాపరాధం కారణంగా ఉన్న ఇంటికి నిప్పు పెట్టుకున్న మాదిరి తయారైంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కదిద్దేందుకు జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాక.. అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.అందుకే అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి.

రేవంత్‌ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్కలు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు. తొలినాళ్లలో రేవంత్‌రెడ్డి కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. తనను వ్యతిరేకించే పెద్దలను పార్టీ అధిష్టానం ద్వారా నచ్చచెప్పి ముందుకు తీసు కుని వెళ్లే ప్రయత్నం చేశారు.

ALSO READ: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ క్రమంలో గత మేలో వరంగల్‌ రాహుల్‌ సభతో పార్టీ ఉనికిలో ఉందని ప్రజలకు చాటి చెప్పడంతో పాటు తామంతా ఐకమత్యంతో ఉన్నామని రుజువు చేసే ప్రయత్నం చేశారు. ఇదే జోష్‌ను కొనసాగిస్తే అధికారంలోకి రావచ్చన్న ధీమాలో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. ఇకపోతే రాష్ట్రంలో పార్టీకి ప్రధానంగా నాయకత్వ లోపం వెంటాడుతున్నది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేరు. అందుకే పార్టీ మాజీ నాయకులను రేవంత్‌ అడపాదడపా కలుస్తున్నారు. వారందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇక సీనియర్లను రేవంత్‌రెడ్డి కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నారు.

జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి సోదరులు, మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్‌, జగ్గారెడ్డి, తదితర నాయకులతో సఖ్యత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలన్న తపన కనబర్చారు. అయితే పార్టీలో పట్టు సాధిస్తనే ప్రజల్లోకి వెళ్ళినా ప్రయోజనం ఉంటుంది.

ఇటీవల రేవంత్‌రెడ్డి చేపట్టిన యాత్ర అద్భుతంగా కొనసాగింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రేవంత్‌ సభ ఊహించని రీతిలో విజయవంతమైంది. దీంతో అధికార పార్టీలో కొంత వణుకు మొదలైంది.

దేశవ్యాప్తంగా పరిశీలిస్తే హస్తం పార్టీ తెలంగాణలో కొంత మెరుగ్గానే ఉంది. పార్టీ నాయకత్వం కూడా దృష్టి సారిస్తే మళ్లీ విజయాలబాట పట్టే అవకాశం ఉంది. రేవంత్‌ రెడ్డి, ముఖ్యనాయకులు అంతా వరుస సవిూక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు.

ఈ క్రమంలో తాజా పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా కాంగ్రెస్‌లో కుదుపు తీసుకుని వచ్చాయి. మర్రి శశిధర్‌ రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిలు పార్టీని వీడారు. మరికొందరు కూడా గోడదూకేందుకు సిద్దంగా ఉన్నారు. కప్పలతక్కెడ లాంటి కాంగ్రెస్‌ను కాపాడడం ఎవరి తరం కాదని వారికి వారే రుజువు చేసుకుంటున్నారు.