Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రధాని ఎవరన్న చర్చ…విపక్షాల్లో ఐక్యత కానరాని ఐక్యత

నితీశ్‌ కుమార్‌ ఐక్యతా యాత్ర !
జాతీయ రాజకీయాల్లో మార్పుతీసుకుని వచ్చి..మోడీకి వ్యతిరేకంగా గంట కట్టాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు ప్రారంభించినా..ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కలసి నడుద్దామని ఒక్కరూ పట్టుబట్ట లేదు. గత మూడేళ్లుగా ఇదే పద్దతి నడుస్తోంది.

మోడీని గద్దె దించాలంటే రాజకీయా పార్టీల్లో ఐక్యత అవసరం. కలసి నడవాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. కాంగ్రెస్‌ బలహీన పడడంతో ఆ బాధ్యతను విపక్ష ప్రాంతీయ పార్టీలు చేపట్టాల్సి ఉంది. కానీ చేపట్టడం లేదు.

తాజాగా బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌ ఇప్పుడు రంగంలోకి దిగారు. అయితే గతంలో ఈ ప్రయత్నం చేసిన కెసిఆర్‌తో నితీశ్‌ ముందుగా చర్చించి ఉంటే కొంత బలం వచ్చేది. సమస్య ఎక్కడ వచ్చిందంటే..ఎవరు ముందుకు వచ్చినా ముందుగా ప్రధాని ఎవరన్న చర్చ తెరపైకి తెస్తున్నారు. దీంతో విపక్షాల్లో ఐక్యత కానరావడం లేదు. దీనికి కారణం కూడా లేక పోలేదు. కేవలం ప్రధాని పదవిని ఆశిస్తున్న వారంతా జట్టు కట్టడంలో వెనకబడి పోతున్నారు.

ALSO READ: పెరిగిన బంగారం ధరలు

ప్రజలపై దొంగప్రేమ నటిస్తున్న వారికి కలసికట్టుగా పోరాటం చేయాలన్న సంకల్పం ఉండడం లేదు. మోడీని పడ గొట్టడమెలా..అంటూ తొడగొడుతన్న పార్టీల్లో జాతీయ ఐక్యత కానరావడం లేదు. జాతీయ విధానాలు ప్రకటించడం లేదు. పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ జాతీయ విధానం ఏమిటో ప్రకటించడం లేదు. తాజాగా నితీశ్‌ కుమార్‌, తేజస్వీ యాదవ్‌ కలసికట్టుగా బయలుదేరారు. ఇంతకు ముందే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే, రాముల్‌ గాంధీలను కలిశారు.

ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ను కలిశారు. తాజాగా మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌లను కలిశారు. కలసి పోరాడుదామని నితీశ్‌ కుమార్‌ సూచించారు. అయితే అంతా తలూపి ఒకే అన్నారు. కానీ గట్టిగా, ధృడచిత్తంతో కలసికట్టుగా బయలు దేరడం లేదు. అన్ని పార్టీల నేతలకు సొంత ఎజెండాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వారు బిగుసుకుని కూర్చుంటున్నారు.

మోడీకి కూడా ఇదే కలసివస్తోంది. దీనిని రాజకీయ పార్టీల నేతలు ముందుగా గమనించాలి. మోడీని పడగొట్టాలను కుంటున్న పార్టీల వారు..ఆయా రాష్టాల్ల్రో తాము ప్రజలకు ఏం చేస్తున్నామో ఆలోచించాలి. ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామో అన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి. నగదు బదిలీ కార్యక్రమాలు తప్ప అభివృద్ది కార్యాక్రమాలపై ఆయాపార్టీలకు చిత్తశుద్ది లేదు.

దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలన్న ధ్యాస లేదు. ఎంతసేపు కేంద్రం ఏం పెట్టిందన్న ధోరణిలో పాలనచేస్తూ విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం అయిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా తొడ గొట్టి, రెచ్చగొట్టే కార్యకలాపాలనే చూపిస్తున్నారు తప్ప ..దేశానికి కావాల్సిన ప్రత్యమ్నాయా మార్గాలను చూపలేకపోతున్నారు.

పార్టీల్లో దూకకుడు వ్యవహారం తీసుకుని వచ్చి మోడీని దింపుదామన్న నమ్మకం కలిగిస్తున్నా..ఆచరణ సాధ్యం కావడం లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవకూడదని అన్ని పార్టీలకు కూడా బలంగానే ఉంది. కేంద్రంలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకూడదని సీఎం కేసీఆర్‌ ఆలస్యంగా అయినా మేల్కొని పట్టుబడుతున్నారు.

ALSO READ: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇందుకోసం తగిన వ్యూహాలు రచించా లని ఆయన ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో ఆ పార్టీని ఓడిరచేందుకు రాష్ట్ర స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు పరస్పరం రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది. అందుకు ఆయన గతంలోనే ఇప్పుడున్న నేతలను కలసి వారి గుమ్మం ముందు నిలిచారు. కానీ ఒక్కరిలో కూడా పరివర్తన రాలేదు. అప్పుడే వచ్చివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు.

అంతెందుకు కర్నాటక ఎన్నికల్లో కలసికట్టుగా కూడా పోటీచేయలేని దౌర్భాగ్యంలో పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌, జనతాదళ్‌, ఇతర పార్టీలు ఎవరికి వారు పోటీకి దిగుతున్నారు. నిజానికి కర్నాటకలో ప్రయోగం చేసి చూపివుంటే జాతీయ
రాజకీయాల్లో ప్రభావం పడేది. కానీ అలాంటి ఏ అవకాశాన్ని వినయోగించుకునే స్థితిలో లేరు. రాష్టాల్ల్రో తమ అధికారం పదిలంగా ఉండాన్న ధ్యాస తప్ప మరోటి కానరావడం లేదు.

ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్న కెసిఆర్‌, నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ లాంటి వారు కేవలం మోడీని దించడంపై గాకుండా.. దేశం గురించి చర్చించాలి. ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలి. ప్రజల్లో వివిధ అంశాలపై ఏకాభిప్రాయం తీసుకుని రావాలి. జనతా ప్రయోగం లాంటి కదలిక తీసుకుని రావాలి. అప్పుడే ప్రజల్లో ఓ ప్రత్యమ్నాయం ఉందన్న స్ఫురణ కలుగుతుంది.

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యకలాపాల్లో బిఆర్‌ఎస్‌ ఇప్పటికే క్రియాశీలంగా ఉద్యమిస్తోంది. కానీ సహేతుక కారణాలు లేకుండా విరుచుకు పడుతోంది. కాంగ్రెస్‌తోనో, మరో పార్టీతో రాజకీయ విభేదాల కారణంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు బీజేపీని వ్యతిరేకించే కూటమి ఏర్పాటులో ముందుకు రావడం లేదు. దీంతో ఐక్యత పక్రియకు విఘాతం కలుగుతోంది. నిజానికి మోడీని దించాలను కుంటున్న నేతలు ఇప్పటికీ ఏకాభ్రిప్రాయా నికి రాలేదు. అసలు ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు తికమకపడుతున్నారు.
మొత్తంగా ప్రధాని మోడీపైన ప్రజల్లో వ్యతిరేకత లేదనడానికి లేదు. అలాగని విపక్షాలపైనా ప్రజలకు ప్రేమలేదు. కాబట్టి మోడీకన్నా బెటర్‌ అన్న చర్చ వస్తే తప్ప ప్రజలు ఎవరినీ నమ్మరు. ఈ విషయాన్ని విపక్షాలు గుర్తించి ముందుకు సాగితేనే సఫలం అవుతారు.

నిజానికి ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు పడగొట్టాల్సిన పనిలేదు. ప్రజలు తలచుకుంటే ఎవరినైనా పడగొట్టి తొడగొడతారు. వారు తలచుకుంటే ఎవరినైనా కూకటివేళ్లతో పెకలించగలరు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, వాజ్‌పేయ్‌, ఎన్టీఆర్‌,చంద్రబాబు, లాంటి వారినందరిని ప్రజలే పగడగొట్టారు.

తెలంగాణ, ఎపిల్లో కెసిఆర్‌, జగన్‌లు జాతీయ రాజకీయాలపై కాంగ్రెస్‌తో సయోధ్యకు కలసి వస్తారా అన్నది కూడా అనుమానమే. ఈ క్రమంలో నితీశ్‌ చేపట్టిన ఐక్యతా యాత్ర ఎంతమేరకు సఫలం అవుతుందన్నది కూడా అనుమానమే.