3200 మెగా పిక్సెల్ ఫొటోలు ఎలా ఉంటాయంటే!

పిక్సెల్స్ పెరిగే కొద్దీ ఫొటో క్వాలిటీ పెరుగుతుంది. అందుకే సెల్ఫీ కెమెరాల్లో, వెనక కెమెరాల్లో ఎక్కువ పిక్సెల్స్ సామర్థ్యం గల లెన్స్‌లను ఉంచుతారు. సాధారణంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లలో 6 మెగాపిక్సెల్ నుంచి 100 మెగా పిక్సెల్ సామర్థ్యం గల కెమెరాలు ఉంటాయి. 100 మెగా పిక్సెల్స్ కెమెరాతో తీసిన ఫొటోలు చాలా క్వాలిటీతో ఉంటాయి. మరి అలాంటి కెమెరాతో ఎవరైనా తీశారా అంటే ఇక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల పేరు చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఇటీవల సెన్సార్ల సాయంతో 3200 మెగా పిక్సెల్ ఫొటోలు తీశారు. ఈ సెన్సార్‌లను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాలో ఉపయోగించబోతున్నారు.

ఈ కెమెరాను యూనివర్సిటీలో ఉన్న లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ టెలిస్కోప్‌ దగ్గర అమర్చనున్నారు. దీని సాయంతో డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్‌ను అధ్యయనం చేయవచ్చు. ఈ సెన్సార్లతో తీసిన ఫొటోలను చూడటానికి 378 4కే అల్ట్రా హై డెఫినిషన్ డిస్‌ప్లే ఉన్న టీవీ తెరలు కావాలి. ఈ ఫొటోల సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సాధారణ కెమెరాలు క్యాప్చర్ చేయలేని ఎన్నో అంశాలను ఈ 3200 మెగాపిక్సెల్స్ పెట్టిన కెమెరా క్యాప్చర్ చేయగలదు. దీనితో తీసిన ఫొటోను ప్రదర్శనకు పెడితే 15 మైళ్ల దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. కంటికి డిమ్‌గా కనిపించే ఎన్నో వస్తువులను ఈ సెన్సార్లు చూడగలవు. ఛార్జ్ కపుల్‌డ్ డివైసెస్ అని పిలిచే 189 సెన్సార్ల ద్వారా ఈ ఫొటో తీయగలిగినట్లు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు బ్లాగులో పేర్కొన్నారు.