Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గంగకు మనమే శాపం

కాలుష్య కాసారంగా మార్చేస్తున్నాం
నమామి గంగే చేపట్టినా..శుద్ది అంతంతమాత్రమే
వారణాశి,ఏప్రిల్‌22: పరమపవిత్రంగా భావించే మన పవిత్ర గంగకు మనమే శాపంగా మారాం. మనమే మన గంగను కాలుష్య కాసారాంగా మార్చేస్తున్నాం. భారతదేశానికి జీవనాడి లాంటి గంగానది దశాబ్దాల పాలకుల నిర్ణక్ష్యం కారణంగా కాలుష్యభరితంగా మారింది. గంగానదిని ప్రక్షాళన చేస్తామని పాలకులు ప్రకటించినా..అంతకుమించిన సంకల్పంతో ప్రజలే గంగానదిని కాలుష్య కాసారాంగా మార్చే స్తున్నారు.

గంగా ప్రక్షాళన కోసం నమామి గంగే అనే కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం తాజాగా రూ.638 కోట్లు విడుదల చేసింది. అయితే, గడిచిన 37 ఏండ్లుగా గంగానదిని శుద్ధి చేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉన్నది. కారణం.. గంగమ్మ కాలుష్యాన్ని పోగొట్టాలన్న చిత్తశుద్ధి కేంద్ర పాలకులకు లేకపోవడమే దీనికి కారణం.

అలాగే ప్రజలకు కూడా చిత్తశుద్ది లేదు. సుమారు 2,525 కిలోవిూటర్ల పొడవుతో, 6,921 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో గంగానది ప్రవహిస్తున్నది.దేశ జనాభాలో దాదాపు 40 కోట్లమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు గంగానది పరీవాహక ప్రాంతం కేంద్రంగా ఉన్నది. వ్యర్థాలను నేరుగా వదులుతుండటంతో నదీజలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి.

ప్రస్తుతం నదిలో 50 శాతం కలుషిత నీరేనని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎన్జీటీ ఇటీవల వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతున్నది. నదీ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఏర్పాటుచేసిన 97 మానిటరింగ్‌ స్టేషన్‌లలో 59 స్టేషన్‌ల దగ్గర నుంచి ’డౌన్‌ టు ఎర్త్‌’ పరిశోధన బృందం గత జనవరిలో విశ్లేషణల కోసం నదీజలాలను సేకరించింది. ఇందులో 42 స్టేషన్ల దగ్గర గంగనీరు ప్రమాదకరస్థాయిలో విషతుల్యంగా మారిపోయిందని తేల్చింది.

ALSO READ: పరమపవిత్రం కాశీ క్షేత్రం

గంగానది వేగంగా కలుషిత మవుతున్నదని అప్పటి ప్రభుత్వం నాలుగు దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్‌ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు రూ.6,788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.4,800 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్‌లో ’నమామి గంగే’ పేరిట కొత్త మిషన్‌ ప్రారంభించింది.

2014`15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకూ గంగానది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్టు గత ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. దీనికోసం రూ.32,912 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపింది. అయితే,ఈ నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ.. గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలి పోయింది.

ఈ క్రమంలో ఎన్జీటీ గంగా ప్రక్షాళన ప్రణాళికలపై అసహనం వ్యక్తం చేసింది. గడిచిన 37 ఏండ్లుగా గంగను శుద్ధిచేస్తున్నా అది నేటికీ కాలుష్యమయంగానే ఉండటంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది.

కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్‌ ప్లాన్‌ (జీఏపీ), నమామి గంగే వంటి కార్యక్రమాలేవీ విజయవంతం కాలేదని, ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పవిత్రగంగను స్వచ్ఛ గంగగా మార్చడంలో పాలకులతో పాటు ప్రజలు కూడా విఫలం అయ్యారు.