Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పరమపవిత్రం కాశీ క్షేత్రం

పుష్కర సమయంలో గంగా స్నానం పుణ్యం
వారణాశి,ఏప్రిల్‌22: కాశీపవిత్రత పరమశివుడి వల్లనే దక్కింది. పరమశివుడు ప్రత్యక్షంగా ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం వల్ల్నే దీనికి అంత ప్రత్యేకత వచ్చింది. అందుకే గంగానదికి కూడా ఇక్కడే అత్యంత పవిత్రత కలిగింది.

గంగాలో స్నానం చేసి కాశీవిశ్వేరుడిని దర్శించుకుంటే వచ్చే పుణ్యం అంతా ఇంతాకాదు. అదీ పుష్కర సమయంలో అయితే మరింత పుణ్యపద్రం. కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే పరమేశ్వరుడు పార్వతిని కళ్యాణం చేసుకున్న తర్వాత కాశీని నివాసంగా చేసుకున్నాడట.

కొంతకాలానికి అక్కడ ఉన్న దేవతలంతా ఈ నగరాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు దివోదాసును రాజుగా ఉండ మన్నారు. ’శివుడు ఇక్కడ ఉంటే దేవగణం ఆయన చుట్టూనే ఉంటారు కాబట్టి పాలించలేను’ అన్నాడట దివోదాసు. అప్పుడు ఈశ్వరుడు పార్వతితో సహా మందర పర్వతానికి తరలివెళ్లాడు. కానీ అక్కడ మనసు లగ్నంకాక..తిరిగి కాశీకి రావాలనుకుని దూతలని పంపితే వాళ్లంతా ఆ పట్టణాన్ని చూసిముగ్ధులై అక్కడే ఉండిపోయారు.

ALSO READ: ప్రారంభమైన గంగానది పుష్కరాలు

ఆ తర్వాత గణెళిషుడిని, బ్రహ్మనీ … ఇలా ఒకరి తరవాత ఒకరిని పంపిస్తే వాళ్లంతాకూడా వెనక్కు రాలేదు. చివరకు తన గణాలను పంపిస్తే అవికూడా అక్కడ ద్వారపాలకులులా స్థిరపడిపోయాయి. దీంతో స్వయంగా శంకరుడే దిగివచ్చి… దివోదాసుకి ముక్తిని ప్రసాదించి కాశీలో కొలువయ్యాడన్నది ఓ పౌరాణిక గాథ. వీళ్లంతా కాశీ పట్నంలో ఉండాలనుకున్నది సౌఖ్యంకోసం కాదు అన్ని బంధాలనీ దాటి విశ్వంలో కలిసే అనుబంధం కోసం మాత్రమే.

ఐదువేల సంవత్సరాలక్రితమే కాశీ నగరం ఉందనీ.. అందుకే వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ కాశీ నగరం ప్రస్తావన ఉందనేది పండితుల అభిప్రాయం. మూడు వేల సంవత్సరాలనాటిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ స్పష్టత లేదు. పూర్వం ఇక్కడ 72 వేల గుడులు ఉండేవనీ యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ అంటారు.

దేశవిదేశీ శాస్త్రవేత్తలు కాశీకి వచ్చి పరిశోధనలు చేయగా శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించినట్లు గుర్తించారు.శ్రీనాధుడు చెప్పినట్టు స్వర్గాన్ని కాశీని పోలిస్తే…కాశీ ముందు స్వర్గం సరితూగదు.

ఈశ్వరుడు మొదటిసారిగా తన మనస్సుతో సృష్టించిన నగరం, విశ్వానికి ఆది నగరం కాబట్టి ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వనాథుడిగా వెలిశాడు. అందుకే కాశీ అంత గొప్ప క్షేత్రం. ప్రళయాంతకంలో కూడా .. అంటే స్వర్గం, బ్రహ్మ, సమస్త విశ్వం పడిపోయిన తర్వాత కూడా కాశీ నగరం మిగిలిపోతుందని స్కంద పురాణంలో ఉంది.