Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రారంభమైన గంగానది పుష్కరాలు

గంగా పుష్కర మహోత్సవం !
గంగాస్నానం పరమపవిత్రం. శివుడి జటాజూటం నుంచి భువికి చేరిన గంగమ్మ పరమపావనీయమైన నది. అందులో స్నానమాచరిస్తే…సర్వపాపాలు పోతాయన్న నానుడి. శతాబ్దాలుగా ఇదే విశ్వాసంతో భక్తులు గంగా స్నానం ఆచరిస్తున్నారు.

హిందువులు పవిత్రంగా భావించే జీవనది గంగానది. పరమపావనిగా పిలిచే ఆ నదీజలాల్లో ఒక్కసారి స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అటువంటి గంగానది పుష్కరాలు శనివారం మొదలయ్యాయి.

12 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కర పర్వంలో లక్షలాది మంది హిందువుల భక్తిశ్రద్ధలతో గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గంగా పుష్కరాలుఏప్రిల్‌ 22 నుండి ప్రారంభమై మే 3న ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు ప్రారంభ మయ్యాయి.

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించిం ది. జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు , మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.

ALSO READ: పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లు RCB వద్దే …

అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు. పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.

తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది

.ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. గంగా పుష్కరం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పరమ పవిత్రమైన పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన విూనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది.

పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని భారతీయులు ముఖ్యంగా హిందువుల విశ్వాసం.

ALSO READ: గోవిందుడికి కాసుల పంట గా విద్యానగర్ కాలనీ పంచాయితీ

ఈ కారణంగా గంగా నదిలో అనేక మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పితృతర్పణాలు వదులుతారు. ఒకప్పుడు విశ్వమొత్తం నీరే ఉండేది. మరో వస్తువుకి తావులేదు. అంతటా ఉన్న పరమేశ్వరుడు సాకారంగా కనిపించాలి అనుకున్నాడు. అప్పటికి సృష్టిలో రుషులు లేవు, మునులు లేరు, బ్రహ్మ లేడు. అప్పుడు కొంత భాగాన్ని సృష్టించి విష్ణువును తలుచుకుని విష్ణువును ఇక్కడి నుంచి సృష్టిచేయి అని చెప్పాడు.

విష్ణువు సృష్టి కార్యంకోసం తపస్సు చేస్తున్నాడు. విష్ణువు తపస్సు వల్ల పాదాల నుంచి గంగాదేవి పుట్టింది. సృష్టించిన కొద్ది భాగాన్ని కప్పేస్తోంది. అప్పుడు ఈశ్వరుడు చూసి త్రిశూలంతో ఆ భాగాన్ని పైకి తీశాడు. ఆ త్రిశూలం నాటిన భాగం కాబట్టి కాశీగా పిలుస్తారు. కాశిక అంటే త్రిశూలం… కాశిక తీసినది కాబట్టి కాశిగా పిలుస్తారు. అంటే సృష్టిలో
మొదట పుట్టిన భాగమే కాశీ.

ఆ తర్వాత విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా మొదలైంది. త్రిశూలంపై శివుడు సృష్టించిన భాగంలో కూర్చునే బ్రహ్మదేవుడు భూమినీ సృష్టించాడు. దేవతలు, రుషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం విూద ఉన్న భూఖండాన్ని అలాగే దించి నేలవిూద నిలబెట్టాడనీ అదే కాశీ పట్టణమనీ శివపురాణం పేర్కొంటోంది. అందుకే బ్రహ్మదేవుడి సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీపట్టణం మాత్రం చెక్కుచెదరదట. అంతేకాదు, దీన్ని మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగానూ చెబుతారు. అందుకే అక్కడికి వెళ్లినవాళ్లకి తిరిగి రావాలనిపించదు.

అందుకే కాశీలో ప్రవహించే గంగానదికి అంతగా పరమపవిత్రత చేకూరింది. కాశీకి అంతే పవిత్ర దక్కింది.
గంగానది ప్రవహించే ప్రతిచోటా ఈ పుష్కరాలు జరుగుతాయి. అయితే, గంగోత్రి, రుషికేశ్‌, హరిద్వార్‌, వారణాసి, ప్రయాగరాజ్‌లో కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతాయి.

ALSO READ: బస్సులు రాని బస్టాండ్

గంగా పుష్కరాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీనే. భక్తులంతా కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భారతీయుల నమ్మకం. అంతేకాదు, గంగానదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భారతీయులు.

గతించిన తమ ఆత్మీయులకు గంగా జలాల్లో పిండప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే, గంగా పుష్కరాలు భారతీయులకు ఎంతో ప్రత్యేకం. తెలుగు ప్రజల కోసం కాశీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈనెల 29న వారణాసిలోని గంగా ఘాట్‌ దగ్గర జరిగే తెలుగు సంగమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు.