అయ్యో రామా! ఇదేనా ద్రాక్షారామ !!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రామచంద్రపురం ఏప్రిల్ 20,(నిజం న్యూస్) జిల్లా బ్యూరో::
చెత్తను డంప్ చేస్తున్నది ఎక్కడో డంపింగ్ యార్డ్ లో కాదండి! ఓ గ్రామ ప్రధాన రహదారి మధ్యలో విచక్షణ లేకుండా డంప్ చేస్తున్నారు. అక్కడ అంతా అదో తీరు. చెత్తను నడిరోడ్డు మీద డంప్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకీ పట్టదు. అలాగనీ ఆ దారిన పోయే స్థానికులకి పట్టదు.
అక్కడ వారికి ఇదేమీ పెద్ద వింతేమీ కాదు. సాక్షాత్తూ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి పక్క భాగంలో ఉన్న రహదారిపై రోజువారి చెత్త డంపింగ్ చేయబడుతుంది. కొత్త వారు ఎవరైనా చూస్తే మటుకు ఒళ్ళు గగుర్పాటు పొందుతుంది. అప్పుడు అనిపిస్తుంది వారికి “అయ్యో రామా ఇదేనా ద్రాక్షారామ!” స్థానికులకు ఇదంతా షరామాములే. అలవాటైపోయింది ఇక్కడి స్థానికులు అందరికీ.
ALSO READ: బంగారం ధరలు తగ్గాయి
అదే మాదిరిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా ఇదంతా తప్పుగా అనిపించట్లేదని విమర్శకులు భావిస్తున్నారు. మనం చేసే పని మనకు తప్పుగా అనిపించకపోయినప్పటికీ తప్పు తప్పేనని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దైవ క్షేత్రాల్లో ముఖ్య క్షేత్రంగా త్రిలింగ క్షేత్రాలలో ముఖ్య క్షేత్రంగా పేరుపడ్డ ద్రాక్షారామ గ్రామంలో జరుగుతున్న ఈ అకృత్యం చూసిన వారు ఎవరైనా సరే ముక్కున వేసుకోవాల్సిందే. ద్రాక్షారామకు శాశ్వతమైన చెత్త డంపింగ్ యార్డ్ లేకపోయినప్పటికీ తగిన ప్రత్యామ్నాయ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మాత్రమే చెత్తను డంపు చేసే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టవలసి ఉంది.
ALSO READ: RCBకి కెప్టెన్‌గా కోహ్లీ…రెండేళ్ల తర్వాత టాస్‌కు..
దేవాలయాలకు దగ్గరలోనూ రహదారుల పైన చెత్తను వేయడం భావ్యం కాదని పలువురు వాపోతున్నారు. ప్రముఖ దైవ క్షేత్రమైన ద్రాక్షారామాలో చెత్త నిర్వహణ ఇలాగే ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో యాత్రికులు సైతం ఇదేమి గ్రామ పాలన అంటూ ప్రశ్నించే పరిస్థితి ఎదురవుతుందని స్థానిక పాలకులు గ్రహించవలసి ఉంది.
ఇదే పారిశుధ్య అంశంపై స్థానిక జనసేన నాయకులు సంపత్ తదితరులు ప్రశ్నించినప్పటికీ చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా ఎవరూ పట్టించుకోని వైనం ఈ ద్రాక్షారామ గ్రామంలో కనిపిస్తోంది.
కావున మన ఊరిలో రోజువారి చెత్తను నిర్వహించడంలో విఫలమైతే రానున్న రోజుల్లో భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, యాత్రికుల దృష్టిలో ద్రాక్షారామ గ్రామ పరిపాలన వ్యవస్థ మరీ చౌకబారు వ్యవస్థలా అనిపించక ముందే మనకు మనం చక్కపడాలని విజ్ఞులు సూచిస్తున్నారు.