Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షణలు సృష్టిస్తోన్న బిజెపి…?

దేశంలో ఆందోళనకరంగా రాజకీయ హింస
రాజకీయ లబ్ది కోసం పరస్పర దాడులు
మతపరమైన ఉద్రిక్తతలకు ప్రోత్సాహం
వ్యూహాలు పన్నుతున్న ప్రాంతీయ నేతలు
న్యూఢిల్లీ,ఏప్రిల్‌19: దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు.

ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షణలు సృష్టిస్తోంది. అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం లేదు.

బెంగాల్లో ఎన్నికలకు ముందు..తరవాతా తృణమూలు దాడులకు తెగించింది. హత్యలకు కూడా వెనకాడలేదు. ఇప్పటికీ బెంగాల్లో హత్యా రాజకీయాలు సాగుతున్నాయి.

కర్నాటకలో హిజాబ్‌ వివాదం తెరపైకి తీసుకుని వచ్చారు. దానిని దేశవ్యాప్తంగా తీసుకుని రావాలని చూశారు. ఇదే పద్దతి ఇప్పుడు తెలంగాణలోనూ మొదలయ్యింది. విమర్శలతో పాటు దాడుల రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల సమస్యలు పక్కకు పోతున్నాయి.

ALSO READ: వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నంలో ప్రతి చర్యను విమర్శిస్తున్నారు. బండి సంజయ్‌ యాత్రలో దాడులకు తెగించడం, కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఆందోళనలు చేయకుండా అరెస్టులు చేసి బెదిరించడం వంటి ఘటనలు చూస్తున్నాం. ఇకపోతే శ్రీరామ నవమి వేడుకలు, హనుమజ్జయంతి ఊరేగింపు సందర్భంగా పలు రాష్టాల్ల్రో చోటుచేసుకున్న ఘర్షణలు, రాళ్ల దాడుల ఉద్రిక్తతల ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

మతపరమైన జెండాలను ఎగురవేయడంతో ఉద్రిక్తత నెలకొంది. యూపిలో సంఘవ్యవరేక శక్తులకు వంతపాడుతున్నారు. సంఘ వ్యతిరేక శక్తులు వాటిని తొలగించే యత్నం చేయడంతో యోగి ప్రభుత్వంపై విమర్వలకు దిగుతున్నారు.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై చర్యల తరవాత కొందరు దానికి మద్దతుగా నిలిచిన ఘటనలు ఉన్నాయి. మొత్తంగా శాంతిని కాపాడాల్సిన పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అల్లర్లను ప్రేరేపిస్తున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు.

దీంతో ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా అన్నది అనుమానమే. నిజానికి అల్లర్లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షించాలి. మరోమారు ఇలాంటి అల్లర్లు, దాడులు, హత్యలు జరక్కుడా చర్యలు తీసుకోవాలి.

ఇదిలావుంటే కేంద్రంలోని బిజెపి లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించాయి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితి పై చర్చించాల్సిన అవసరం ఉందంటూ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరుతున్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతకల్లోలాల సృష్టికి ప్రయత్నాలు తదితర అంశాలపై చర్చ జరపాలని కోరుతున్నారు. ఆహారం, వస్త్రధారణ, విశ్వాసం, పండుగలు, భాషవంటివాటిని సమాజాన్ని విభజించేందుకు మోదీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.