‘ధరణి’లో అనేక లోపాలు.. హ్యాక్ ఐతే ఎలా?

నూతన రెవెన్యూ బిల్లుపై శాసనసభలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్ పలు అంశాలపై మాట్లాడారు. ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు ఉన్నాయని, అసైన్డ్‌ భూముల ఎంట్రీ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏటా జరిగే జమాబందీ, సమగ్ర భూ సర్వే చేయకపోతే సమస్యలు అలాగే ఉంటాయని, భూ సర్వే ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

భూముల డిజిటలైజేషన్ ప్రక్రియ మంచిదే అయినప్పటికీ ధరణి సర్వర్‌ ఎవరైనా హ్యాక్‌ చేసి రికార్డ్స్‌ మార్చితే ఎలా అని, మాన్యువల్‌ రికార్డులు కూడా ఉండేట్టు చూడాలని ప్రభుత్వానికి సూచించారు. చాలా సందేహాలు ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రుణాలు తీసుకునే విషయంలో పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ మార్టిగేజ్ చేయాలని అడుగుతున్నారని, నిబంధనల్లో లేకున్నా అమాయక రైతులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. వ్యవసాయ భూములన్నీ తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని కొత్త చట్టంలో చెబుతున్నారని, డిజిటలైజేషన్ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని వెల్లడించారు.