ఇద్దరిని బలి తీసుకున్న బయో డీజిల్ ట్యాంక్

*అనుమానం వ్యక్తం చేస్తూ బంధువుల ఆందోళన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రామచంద్రపురం ఏప్రిల్ 19,(నిజం న్యూస్) బ్యూరో::
రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ప్రధాన రహదారికి ఆనుకుని మూతపడి నిరుపయోగంగా ఉన్న బంకు ఉంది.
బంకు యాజమాన్యం దీనికి సంబంధించిన బయోడీజిల్ ట్యాంకు ఒకటి ఖాళీ చేసి మూలన పడేసారు. అయితే ఈ మూతపడిన బయో డీజిల్ ట్యాంకులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన గొల్లపాలెం పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
ALSO READ: కుట్రలు, కుతంత్రాలు తప్ప మరోటి తెలియని బిజెపి
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యవటానికి చెందిన తాతపూడి మహేష్ (25), శీల గ్రామానికి చెందిన నేరేడుమిల్లి శివకుమార్ (25)లు ఖాళీగా పడి ఉన్న బయో డీజిల్ ట్యాంకులోనికి దిగారు. దానిలో ఊపిరి ఆడక కేకలు పెట్టారు.
స్థానికులు వెంటనే గమనించి అతికష్టంపై యువకులను బయటకు తీసారు. అప్పటికే యువకులు మృతి చెందారు. ట్యాంకులో మిగిలి ఉన్న డీజిల్ కోసమే యువకులు లోనికి దిగి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతుండగా, మృతుల బంధువులు మట్టుకు వీరి మరణాల పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
విషయం తెలిసిన కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాసరావు, గొల్లపాలెం ఎస్పై ఎస్ తులసీరామ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం పోలీసులు విచారణలో తేలాల్సిఉంది.