రెవె‘న్యూ’ యాక్ట్‌తో కబ్జాలకు చెక్..

న్యూస్‌బ్యూరో: ‘‘ఒక్క రోజులో చట్టాలు రాలేదు. కాలక్రమేణా వచ్చాయి. 87 చట్టాలతో తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం 2020 అమలు చేస్తాం. ఆర్వోఆర్‌లో ధరణి సర్వస్వం కాదు. కన్ క్లూజివ్ టైటిల్ దిశగా అడుగులు వేస్తున్నాం. కొంత సమయం పడుతుంది. అధునాతన టెక్నాలజీ వచ్చింది. డిజిటల్ సర్వే చేపడుతాం. లిటిగేషన్లు అత్యల్పం. జాగీర్ రద్దు, ఇనాం రద్దు వంటివి వచ్చాయి. వాడు ఇచ్చిండు.. వీడు ఇచ్చిండు అంటూ వస్తనే ఉన్నరు. ఎంత కాలం ఇది? ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తీసుకొస్తనే ఉన్నరు. ఇలాంటి కబ్జాలకు చెక్ పెట్టాలని కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బిల్లులపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.
రెవెన్యూ శాఖ మనదేనని, వారు 50 రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. తహశీల్దార్లను నమ్మకపోతే మరెవరిని నమ్ముతామన్నారు. కొందరే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కుటుంబ సభ్యులకే అధికారాలు ఇస్తున్నాం. వారి నిర్ణయం మేరకు పౌతి చేసే చట్టాన్ని రూపొందించామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులెవరైనా రాకపోతే తహశీల్దార్ కు ఫిర్యాదు చేయాలి. లేదంటే కోర్టుకు వెళ్లాలి అని అన్నారు. వారసత్వ సమస్యలేవీ తలెత్తకుండా ఉంటుందన్నారు. వివాదాలు లేకుండా విశ్వప్రయత్నం చేస్తాం. ఇది విప్లవాత్మక చట్టం. ప్రజలకు మేలు జరుగుతుంది. వివాదాలు తగ్గుతాయని అన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వినతి మేరకు అప్పటికప్పుడే బండ్లగూడ ఏరియాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.