‘గ్రేటర్’ ఎన్నికలే కొండా దంపతుల టార్గెట్..

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కొండా దంపతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 200 మంది కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.

దిశ ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ కీలకంగా వ్యవహరించారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె భర్తతో పాటు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. కానీ టీఆర్ఎస్ అధినేత గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ మహిళా నేతకు కాంగ్రెస్ పెద్దపీట వేయబోతోందా? ఇక వరంగల్ జిల్లాలో ఆ దంపతులు చక్రం తిప్పబోతున్నారా? త్వరలోనే జరగబోయే మహానగరపాలక సంస్థ ఎన్నికలనే టార్గెట్ చేసుకున్నారా? అనే విషయాలపై ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.