Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మిల్లర్ల అక్రమాలకు చెక్‌

ఎక్కడి ధాన్యం అక్కడే సేకరణ
ఇతర ప్రాంతాలకు వెళ్ళి అమ్మే చర్యలకు చెక్‌
మంత్రి గంగుల ఆదేశాలతో అధికారుల చర్య
మిల్లర్ల అక్రమలకు చెక్‌ పెట్టిన మంత్రి
కరీంనగర్‌,ఏప్రిల్‌17:ధాన్యం, బియ్యం రవాణాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆంక్షలు లేకపోయినా… కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను నియంత్రించేందుకు ఈ యాసంగి సీజన్‌ నుంచి లోకల్‌, నాన్‌లోకల్‌ నిబంధన పెట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎక్కడికక్కడ ధాన్యం సేకరణ కట్టుదిట్టం చేసేలా మార్గదర్శకాలు జారీచేశారు.

ఇకనుంచి ఏ ఊరి రైతు… ఆ ఊరి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డ్‌ పరిశీలించి స్థానికుడా? వేరే ప్రాంతానికి చెందిన రైతా? అని పరిశీలించి అనుమతిస్తారు. ఆ రైతుకు ఎంత భూమి ఉంది.. వరిసాగు చేసిందెంత.. ధాన్యం అతనిదేనా? కాదా? అనే వివరాలు పరిశీలించిన తర్వాత కాంటా పెట్టాలని ఆదేశాలు జారీఅయ్యాయి.

ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు సరిపడా ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలు ఉన్నాయి. 594 మండలాల పరిధిలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ యాసంగిలో 7,028 సెంటర్లు ఏర్పాటుచేస్తామని మంత్రి కమలాకర్‌ ప్రకటించారు.

చిన్న గ్రామాలైతే… రెండిరటికి ఒక సెంటరు, పెద్ద గ్రామాలైతే… ఒకే ఊరిలో రెండు సెంటర్లు! ఇలా అవసరానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఏ ఊరి రైతులు… ఏ కేంద్రంలో ధాన్యం అమ్మాలో కూడా నిర్ణయిం చారు. క్షేత్రస్థాయి అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు.

ALSO READ: బిఆర్‌ఎస్‌లో డోర్నకల్‌ చిచ్చు

రాష్ట్రంలో రైతులు ఎక్కడి నుంచైనా ధాన్యం తరలించి, తమకిష్టమైన కొనుగోలు కేంద్రంలో అమ్ముకునే పద్ధతికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ స్వస్తిచెప్పింది. గతంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను, రైతుల పేరుతో రైస్‌మిల్లర్లు చేసిన దందాను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఇచ్చిన ఆదేశాలమేరకు… పౌరసరఫరాల సంస్థ అధికారులు నిబంధనలను మార్చేశారు.

ఇక నుంచి ఎక్కడి ధాన్యం అక్కడే కాంటా వేయాలని, పొరుగు గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని సేకరించొద్దని ఆదేశాలు జారీచేశారు. ధాన్యం కొనుగోళ్ల పక్రియలో ఎక్కడి నుంచైనా తీసుకువచ్చిన ధాన్యాన్ని, మరెక్కడైనా అమ్ముకునే అవకాశం ఇదివరకు ఉండేది. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈ సడలింపులను ఆసరగా చేసుకొని రైస్‌మిల్లర్లు, దళారులు అక్రమాలకు పాల్పడ్డారు. రెండేళ్ల క్రితం 15 మంది రైస్‌మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. ప్రైవేటుగా తక్కువ ధరకు కొనుగోలుచేసిన ధాన్యాన్ని, ఎమ్మెస్పీకి కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి కుచ్చు టోపీ పెట్టారు.

ALSO READ: 23న హైదరాబాద్‌కు అమిత్‌ షా

అప్పట్లో కొందరు మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. ఇకపోతే ధాన్యంలో తేమ 17 శాతానికి మించి ఉండకూడదు. ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారబట్టి సెంటర్లకు తీసుకురావాలని అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ధాన్యం సేకరించబోమని రైతులకు ఇప్పటికే సమాచారమిచ్చారు.

ఈసారి వరి ధాన్యం కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే పక్షం రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయని, వెంటనే సెంటర్లు తెరవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించటంతో… ఈనెల 11 తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే ప్యాడీ పర్చేస్‌ సెంటర్లు ప్రారంభమయ్యాయి.