బిఆర్‌ఎస్‌లో డోర్నకల్ చిచ్చు

మంత్రి సత్యవతి ప్రకటనతో మరోమారు చర్చ
మహబూబాబాద్,ఏప్రిల్17: డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పుడు అధికార బిఆర్‌ఎస్‌లో సీటు పోటీ చిచ్చు రేపుతోంది. ఇప్పటికే తన చావు కోరుకుంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఘాటు విమర్శలు చేశారు.
ఈ క్రమంలో పార్టీ అవకాశం ఇస్తే డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తానన్నారు. తన ఆప్షన్ అయితే డోర్నకల్లేనని అన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది డోర్నకల్ నియోజకవర్గమేనన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో మంత్రి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు డోర్నకల్‌లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. ఇటీవలే తన ఓటమికి కుట్రలు చేస్తున్నారని పరోక్షంగా రాథోడ్‌ను ఉద్దేశించి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇద్దరూ బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలే కావడంతో పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
READ ALSO : 24 గంటల్లో 27 మంది మృత్యువాత
సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున డోర్నకల్ నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించడంతో ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఇది చర్చగా మారింది. డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ’మళ్లీ విూరు డోర్నకల్ నుంచి పోటీ చేస్తే.. అన్ని విధాలా సహకరిస్తాం’ అని వారు అనడంతో ఆమె స్పందించారు.
తన రాజకీయ జీవితం డోర్నకల్ నుంచే ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేస్తానన్నారు. అభివృద్ధిలో భాగంగా డోర్నకల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. త్వరలో డోర్నకల్ లో మరో గిరిజన గురుకులాన్ని మంజూరు చేయనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్ కొనసాగుతుండగా మంత్రి కామెంట్స్‌తో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ నాగుబండి లక్ష్మణ్, రిటైర్డ్ టీచర్, కళాకారుడు ఆనంద్ కుమార్, అడ్వకేట్ కుమారస్వామి, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ బృందాదార్ రావు
పాల్గొన్నారు.