ఉత్తరప్రదేశ్ 183 ఎన్‌కౌంటర్లు….సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్
యూపిలో ఇప్పటివరకు 183 ఎన్‌కౌంటర్లు
వాటిపై విచారణ చేయాల్సిందే
సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
న్యూఢల్లీి,ఏప్రిల్17: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2017వ సంవత్సరం నుంచి జరిగిన ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య ఘటన తర్వాత యూపీలో 183 ఎన్‌కౌంటర్లపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడం సంచలనం రేపింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను పోలీసుల సమక్షంలో ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తరలించగా దుండగులు కాల్చి చంపారు.
దీనిపై న్యాయవాది విశాల్ తివారీ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 2017వ సంవత్సరం నుంచి జరిగిన 183 ఎన్‌కౌంటర్‌లపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాది కోరారు.
ALSO READ: 23న హైదరాబాద్‌కు అమిత్ షా
పోలీసుల సమక్షంలోనే దుండగులు అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య గురించి కూడా న్యాయవాది ప్రశ్నించారు.వికాస్ దూబే, అతని సహాయకులు కాన్పూర్ బిక్రూ ఎన్‌కౌంటర్ కేసు 2020వ సంవత్సరంలో సాక్ష్యాలను దర్యాప్తు చేసి,కేసు నమోదు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఆదేశించడం ద్వారా నకిలీ ఎన్‌కౌంటర్లను వెలికితీసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది విశాల్ తివారీ తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు.
వికాస్ దూబే కాన్పూర్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తాను కోర్టును ఆశ్రయించానని, అతిక్ అహ్మద్ గ్యాంగ్‌స్టర్ కుమారుడైన అసద్‌ని యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ లో హతమార్చిన సంఘటనే పునరావృతం చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు పెను ముప్పు అని, ఇలాంటి చర్యలు పోలీసు రాజ్యంలో అరాచకత్వానికి కారణమని పిటిషనర్ పేర్కొన్నారు.
శిక్షించే అధికారం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంటుంది. పోలీసులు డేర్ డెవిల్స్‌గా మారినప్పుడు, మొత్తం న్యాయవ్యవస్థ కూలిపోతుంది. పోలీసులపై ప్రజల మనస్సుల్లో భయాన్ని సృష్టిస్తుంది, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనదని పిటిషనర్ చెప్పారు.