విశాఖ ఉక్కు కొనుగోలు నాటకానికి తెరతీసిన కెసిఆర్..?
కుడితిలో పడ్డ బల్లిలా బిఆర్‌ఎస్ పరిస్థితి !
విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు ఇప్పుడు బిఆర్‌ఎస్ మంత్రులు ఏం చెబుతారో చెప్పాలి. విశాఖ ఉక్కు ప్రవేటీకరణలో వెనక్కి తగ్గలేదని కేంద్రం తెగేసి చెప్పింది. విశాఖకు వచ్చిన కేంద్రమంత్రి కులస్థే ప్రజలతో పాటు..ప్రధానంగా బిఆర్‌ఎస్ చెవిలో పూలు పెట్టి వెళ్లారు.
తమవల్లనే ప్రైవేటీకరణ ఆగిందని, కేంద్రం దిగి వచ్చిందని చెప్పిన తెలంగాణ మంత్రులు కెటిఆర్,హరీష్ రావు, జగదీశ్‌రెడ్డిలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఎపి ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నారో చెప్పాలి.
కేంద్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఎలా ఉంటాయో చెప్పాలి. విశాఖ ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నాలు ఉన్నాయా లేదా చెప్పాలి. కేంద్రం విశాఖ ఉక్కుపై ముందునుంచీ ప్రైవేటీకరణ మంత్రం పాడుతోంది. ఓ రకంగా కేంద్రమంత్రి కులస్థే వచ్చి..బిఆర్‌ఎస్‌ను, మంత్రులను ఫూల్స్ చేసి పోయారని గుర్తించాలి.
అందువల్ల ఇప్పుడు కేంద్రంపై విమర్శలు చేయడం మాని కార్యాచారణ ప్రకటించాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నారో చెప్పాలి. కేవలం రాజకీయ ప్రకటనలతో మభ్య పెట్టడం మానుకోవాలి. కేంద్రం ఆడిన నాటకంలో బిఆర్‌ఎస్ నేతలు భంగపడ్డారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ముడిపదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు దరఖాస్తులు పిలవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సింగరేణి సంస్థ బిడ్ వేయనున్నట్టు ప్రకటించడంతో బిఆర్‌ఎస్ ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేసిందని నమ్మించారు.
ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎవరికి వారు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించారు. మొత్తంగా తెలుగు రాష్టాల్ల్రోని రాజకీయ పార్టీల అసలు రంగు ఏంటన్నది బయటపడిరది. రాష్ట్ర ప్రభుత్వాల పరిమితులు తెలుసుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల వేటలో ప్రజలను నమ్మించాలని బొక్కమోల్తా పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పాదం మోపాలని చూస్తున్న కెసిఆర్‌కు, బిఆర్‌ఎస్‌కు అంతా కలసి వచ్చిందన్ననమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. మంత్రులు ఓ అడుగు ముందుకు వేసి కెసిఆర్ తలచుకుంటే..అంటూ మోడీకి సవాళ్లు విసిరారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంతోపాటు ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లు ప్రకటించుకు న్నారు. విశాఖ ఉక్కును తాము కొనుగోలు చేస్తామని కేసీఆర్ అండ్ కో ప్రకటించుకుంది. కెసిఆర్‌కున్న స్పృహ,జ్ఞానం ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డికి లేదని అక్కడి విపక్షాలు మండిపడ్డాయి.
ఈ క్రమంలో ఇరు రాష్టాల్ర మంత్రుల మధ్య మాటల యుద్థం తారాస్థాయికి చేరిన విషయాన్నీ చూశాం. ఈ తతంగం జరుగు తుండగానే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన లేదన్నట్టుగా కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీ ప్రకటన చేశారు. అంతే… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోవడానికి తమ నాయకుడు కేసీఆరే కారణమంటూ తెలంగాణ మంత్రులతోపాటు బీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా చంకలు గుద్దుకున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడంతో ఇప్పుడు అంతా తెల్ల మొహం వేశారు. వీరతాళ్లు వేసుకున్న బిఆర్‌ఎస్ మంత్రులు అప్పటి నుంచి మాట కూడా మాట్లాడడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కానీ, బ్లాస్ట్ ఫర్నేస్‌ను కానీ కొనుగోలు చేసి, నడిపేంత ఆర్థిక బలం సింగరేణి సంస్థకు కూడా లేదు.
సింగరేణి నిధులు కరిగిపోగా.. అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. అప్పుల కోసం ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఏటా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే అప్పుల కోసం అన్వేషించడం మేడిపండు చందంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో విశాఖ ఉక్కుకు ముడిపదార్థాలు సరఫరా చేయడం లేదా మూలధనం సమకూర్చేందుకు సింగరేణి సిద్ధం కావడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కేసీఆర్ ఆదేశించారు గనుక సింగరేణి అధికారులు ముందూ వెనుకా ఆలోచించకుండా విశాఖ వెళ్లి వచ్చారు.
ALSO READ: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలి
జాతీయపార్టీగా బిఆర్‌ఎస్ ప్రకటించాక..ఎపిలో రాజకీయాలు వెలగబెట్టాలనుకుంటున్న కెసిఆర్ విశాఖ ఉక్కు కొనుగోలు నాటకానికి తెరతీశారు. తెలంగాణలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించే ఆలోచన కూడా చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ ఉక్కును కొంటామని ప్రకటనలు చేయగానే ఎవరు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు.
ఎందు కంటే నిజాం షుగర్స్ 9 ఏళ్లయినా తెరుచుకోలేదు. ఆజంజాహీ ముచ్చటేలేదు. ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి కార్మికులు రోడ్డుపాలయ్యారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.
ఉమ్మడి వరంగల్‌లోని ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణలో మూతపడి న పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్ పొరుగు రాష్ట్రంలోని ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడటం, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం కేవలం రాజకీయం కోసం తప్ప మరోటి కాదు.
నిజంగానే కెసిఆర్‌కు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునే క్రమంలో ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. ఎపి ప్రజల గురించి కూడా ఆలోచిస్తే విశాక ఉక్కును ప్రైవేటకరించకుండా ఢల్లీిలో పోరాడాలి.
ఢల్లీి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అన్ని రాజకీయపార్టీలను కూడగట్టి కేంద్రాన్ని నిలదీస్తే కెసిఆర్ చిత్తశుద్దితో ఉన్నట్లు ప్రజలు కూడా నమ్ముతారు. ఎన్నికల ముందు చేసే ప్రయత్నాలు ఎప్పటికైనా బెడిసి కొడతాయి. రాజకీయాలు చేయడం వేరు..ప్రజలకు సేవచేయడం వేరు..ప్రజలను నమ్మించి ఓట్లు కొనుగోలు చేయడం వేరు.
ఈ ప్రక్రియలో ఎవరు ఎటువైపు అన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అందువల్ల చిత్తశుద్దితో చేసే ప్రయత్నాలను మాత్రమే ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కెసిఆర్, బిఆర్‌ఎస్ మంత్రులు విశాక విషయంలో కుడితిలో పడ్డ బల్లిలా మిన్నకు న్నారు.