Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీడింగ్ రూముల ఏర్పాటుకు నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రీడింగ్ రూములను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రంథాలయ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీనికోసం ప్రభుత్వం బడ్జెట్ ను సైతం కేటాయించింది. ఈ విధానాన్ని మొదట రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా, తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసిన నేపథ్యంలో పోటీపరీక్షలకు హాజరయ్యే యువత కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 80,912 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయగా కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఉద్యోగాల్లో పాల్గొనాలనుకునే యువత పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

కోచింగ్‌ సెంటర్లకు వెళ్లలేని గ్రామీణ ప్రాంతాలవారి కోసం జిల్లా గ్రంథాలయసంస్థ ఆయా గ్రామాల్లో పౌర పఠణ కేంద్రాల(పబ్లిక్‌ రీడింగ్‌ రూం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రంగారెడ్డిజిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందుకోసం జిల్లా గ్రంథాలయ సంస్థకు బాధ్యతలను అప్పగించింది.

ALSO READ: మంటల్లో చిక్కుకొని ఒకే కుటుంబంలో ముగ్గురు…

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మేజర్‌ గ్రామపంచాయతీల్లో పబ్లిక్‌ రీడింగ్‌ రూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామపంచాయతీల్లో ఒక్క గది తీసుకుని అందులో పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచటంతో పాటు వివిధ వార్తా పత్రికలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ పబ్లిక్‌ రీడింగ్‌ రూంలలో గ్రంథాలయ సంస్థ నుంచి 20 కుర్చీలు, 2 టేబుళ్లు, 2 అల్మారాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణను సంబంధిత గ్రామపంచాయతీలకు అప్పగించి ప్రతి నెల రూ.1500 నుంచి రూ.2వేల వరకు కూడా గ్రంథాలయ సంస్థ నుంచి అందజేయనున్నారు. ఈ పబ్లిక్‌ రీడింగ్‌ రూంలలో చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేలా గ్రంథాలయ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.

ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు.. అలాగే, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలు, వార్తా పత్రికలు కూడా అందుబాటులో ఉంచుతాం. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పబ్లిక్‌ రీడింగ్‌ రూంలలో చదువుకోవటానికి వచ్చే యువతకు అన్ని వసతులను కల్పిస్తాం. వీటి నిర్వహణ కోసం సంబంధిత గ్రామపంచాయతీలకు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ప్రతి నెల డబ్బులను కూడా అందించనున్నాం.