Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం తప్పలే

విశాఖ ఉక్కుపై మోడీతో ప్రకటన చేయించాలి !
విశాఖ ఉక్కుపై ఎట్టకేలకు కేంద్రం వెనక్కి తగ్గింది. ఓ రకంగా ప్రజలు, కార్మికులు, నేతలు ఎవరికి వారు చేసిన పోరాటం వల్లనే తాత్కాలికంగా అయినా ఇది వెనక్కి పోయింది. అంటే మున్ముందు ప్రమాదం లేదని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఎప్పుడూ కొరడా పట్టుకునే ఉంటుంది. తను అనుకున్న పని నెరవేర్చుకోవడం కోసం మోడీ ఎంతకైనా తెగిస్తారు. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న ముప్పు మాత్రం తప్పలేదని గుర్తించాలి.

ఇకపోతే అనూహ్యంగా కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే వైజాగ్‌లో కాలుమోపి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని స్పష్టం చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నా మని, స్టీల్‌ ప్లాంట్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని ఫగ్గన్‌ సింగ్‌ వెల్లడిరచారు. స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

బిడ్‌లో తెలంగాణ సర్కార్‌ పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే అభిప్రాయపడ్డారు. నిజానికి మొన్నటి పార్లమెంట్‌ సమావేశాల వరకు అనేకమార్లు విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మొండి విషయమే ప్రదర్శించింది.

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగి పోయిందని నిర్మలా సీతారామన్‌ అనేకసార్లు అధికారికంగా ప్రకటించింది. ఇది కాదనలేని నిజం. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి నేతలు రొమ్ము విరుచుకోవడం కాదు..రికార్డులు తీసి మాట్లాడాలి.

నిజానికి అన్ని ప్రయత్నాలు బెడిసిన తరవాతనే తెలంగాణ సిఇఎం కెసిఆర్‌ ఎంటర్‌ అయ్యారు. ఆయన రాజకీయాలు ఆయనకు ఉండొచ్చు గాక..కానీ విశాఖ ఉక్కు ద్వారా మోడీ ప్రైవీటీకరణ విధానాన్ని ఎండగట్టాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.

సాగుచట్టాలను రద్దు చేయడానికి రైతులు దేశవ్యాప్తంగా ఏడాదికి పైగా ఉద్యమిస్తే తప్ప దిగిరాని జగమొంది మోడీ అన్న నిజం మనందరికీ తెలుసు. విశాఖ విషయంలో కూడా వందల సార్లు కేంద్రం ప్రైవేటీకరణను ఆపేది లేదని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో సింగరేణిని రంగంలోకి దింపి..బయ్యారం గనులను విశాఖ ఉక్కుకు తరలించే బృహత్తర ప్రణాళికతో విశాఖ ఉక్కును అడ్డుకునే అతిపెద్ద ప్రయత్నం మాత్రం కెసిఆర్‌ వల్లలనే జరిగింది. ఇదికూడా కాదనలేని నిజం. దీనిని జీర్ణించుకోలేని ఎపి పెద్దలు, బిజెపి పెద్దలు ఇవాళ బీరాలు పలుకుతున్నారు.

నిజంగానే వారే ఈ ప్రయత్నం చేసివుంటే బహరంగంగానే ముందుగానే చెప్పాల్సి ఉంది. బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, మంత్రులుగానీ ఈ ప్రయత్నాలు చేసివుంటే ముందే చెప్పాల్సి ఉంది.

బిజెపి ఎంపిలంతా ప్రయత్నం చేశామని జివిఎల్‌ చెప్పినంత మాత్రన పూలు పెట్టుకోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న కార్మికులకు కనీసం మద్దతు పలకలేని దద్దమ్మ లీడర్లంతా ఇవాళ తామే కారణమని చెప్పకుంటున్నారు.

విశృాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ కూడా స్టీల్‌ ప్లాంట్‌పై ఒక్క మాటకూడా మాట్లాడలేదు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ది ఉంటే కనీసంగా అయినా ప్రకటన చేసేవారు. ఎప్పుడు.. ఎక్కడా చూచాయగా కూడా విశాఖ ఉక్కును ప్రైవటీకరణ కాకుండా చేద్దామని అధికారంలో ఉన్న బిజెపి, వైసిపి కూడా ప్రకటించలేదు.

కెసిఆర్‌ రంగంలోకి దిగిన తరవాతనే కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ అనూహ్యంగా విశాఖకు రావడం..ప్రైవేటీకరణను వెనక్కి తీసుకుంటూ ప్రకటించడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు..అధికారుల బృందాన్ని అధ్యయనానికి పంపింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించిన నేపథ్యంలో.. దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించారు.

ALSO READ: మోడి సేవలు సంపన్నుల కోసమే

బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా.. అటు రాజకీయంగా కేంద్రం లోని బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినట్లవుతుందని.. కెసిఆర్‌ భావించారు.

ప్రైవేటీకరణను అడ్డుకో వడం ద్వారా రెండు తెలుగు రాష్టాల్ల్రోనే గాక దేశమంతా ప్రచారం వస్తుందని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ భావించారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే.. దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణా సీఎం కేసీఆర్‌ సింగరేణి కాలరీస్‌తో బిడ్‌ వేయించడానికి పూనుకున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఇకముందు విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడిపించేలా అంతా ముందుకు నడవాల్సి ఉంది.

విశాఖ ఉక్కును పూర్తిగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఆగిపోలేదని గుర్తించాలి. దీనిని నిర్వీర్యం చేయడం ద్వారా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆగిపోలేదని గుర్తించాలి. అప్రమత్తం కాకుంటే విశాఖ ను ధారాదత్తం చేయడం ఖాయం. తామే అడ్డుకున్నామని వీరతాళ్లు వేసుకున్న బిజెపి ఎంపి జివిఎల్‌, ఇతర ఎంపిలు, మంత్రులు వెంటనే దీనిపై ప్రధానితో ప్రకటన చేయించాలి.

అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేసినట్లుగా విశాఖ స్టీల్‌ ప్రైవీటీకరణ లేదని చెప్పించాలి. ఇందుకు ఎంపిగా జివిఎల్‌ బాధ్యత తీసుకుంటే పేరు ప్రఖ్యాతులు ఆయనే పొందవచ్చు.