Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎపి అభివృద్ది నిల్ … జగన్‌ ఆస్తులు ఫుల్

ఎపిలో అభివృద్ది లేదని ఎవరన్నారు
అప్పుల్లో నెంబర్‌ వన్‌.జగన్‌ ఆస్తుల్లో నెంబర్‌ వన్‌
ఆదానీకి దోచిపెట్టడంలోనూ ముందున్నాం
హరీష్‌ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
అమరావతి,ఏప్రిల్‌13(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ, తెలంగాణలో అభివృద్ధిపై రెండు తెలుగు రాష్టాల్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనదైన శైలిలో స్పందించారు.

ఆంధ్రాలో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అభివృద్ది విూకు కనిపించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీష్‌ రావుకు తెలియడం లేదా అంటూ ఎద్దేవా చేశారు.

ALSO READ: అమిత్ షాను కలిసిన ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలే..?

భారతదేశంలో జగన్‌మోహన్‌ రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అని అన్నారు. ఆదానీకి ఏపీలోని పోర్టులు, విద్యుత్‌ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి ఆదానీని అభివృద్ధి చేయటం కనపడలేదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హావిూలు సాధిస్తానన్న జగన్మోహన్‌ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పటం గమనించలేదా? అని అడిగారు.

ఇన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదని హరీష్‌ రావు చెప్పటం హాస్యాస్పదమంటూ హరీష్‌రావు వ్యాఖ్యలను తప్పుబడుతూనే… వైసీపీ ప్రభుత్వంపై రామకృష్ణ చురకలంటించారు.

ఎపిలో అభివృద్ది అడుగంటిందని, అప్పులు పెరిగాయని, జగన్‌ ఆస్తులు అంతకుమించి పెరిగాయని అంటూ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.