Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎన్టీఆర్‌ ఏం చేసినా చరిత్రే

పార్టీ పెట్టిన 9 నెల్లలోనే అధికారంలోకి వచ్చారు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహానేత
నిమ్మకూరు ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు

విజయవాడ,ఏప్రిల్‌13: ఎన్టీఆర్‌ ఏం చేసినా చరిత్రేనని, సినీ రంగంలో ఉంటూ సామాజిక బాధ్యతతో ఆలోచించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు.తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన 9 నెలల్లో సీఎం అయి చరిత్ర సృష్టించారని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదిగారని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్‌ స్ఫూర్తి, ఆలోచన, సిద్దాంతాలు ఉంటాయన్నారు.

గురువారం ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుకు వచ్చి సాయం అందించారన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

ALSO READ: ఎన్‌కౌంటర్‌ లో గ్యాంగ్‌స్టర్‌ అసద్‌, గులాం హతం

తెలుగు భాష అంతరిస్తే.. జాతి అంతరిస్తుందని ముందే ఊహించారన్నారు. కృషి, పట్టుదలతో మహోన్నత వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఎన్టీఆర్‌ తనతో చెప్పేవారని విశ్రాంతి తీసుకునే సమయంలో జనం కోసం పనిచేశారన్నారు.

సాంకేతికతను ముందు చూపుతో ప్రోత్సహించామన్నారు. హైదరాబాద్‌ నెంబర్‌ వన్‌గా ఉందంటే అది టీడీపీ పాలనకు నిదర్శన మని, ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్ట్‌, హైటెక్‌సిటీ టీడీపీ పాలనను గుర్తు చేస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మే 28లోపు 100 సమావేశాలు పెట్టాలని నిర్ణయించామని, అన్ని చోట్లా ఎన్టీఆర్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును లోకేష్‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని చెప్పారు. ఇప్పుడు నిమ్మకూరులో అన్ని వసతులు ఉన్నాయని, తల్లిదండ్రుల తీరు సరిగా ఉంటేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, పర్యవేక్షణ లేకుంటే పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగువారు ఎక్కడున్నా నెంబర్‌.1గా ఉండాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు అన్నారు. అమెరికాలో తెలుగువారికే ఎక్కువ ఆదాయం ఉంటుందని, అది మనకి గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఏపీని పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది టీడీపీ వస్తుందని.. రాష్టాన్రికి పూర్వవైభవం తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్‌ సూత్రాన్ని అమలు చేస్తామని, పేదలను ఆర్థికంగా పైకి తెస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. జీవితంలో స్థిరపడ్డవారు స్వగ్రామాలను అభివృద్ధి చేయాలని.. ప్రతి గ్రామంలో 5 కుటుంబాలకు చేయూతనివ్వాలని సూచించారు.

బాగా పనిచేసిన వారిని టీడీపీ తరపున సన్మానిస్తామన్నారు. ఒక కాన్సెప్ట్‌ రూపొందించి రాష్ట్రం మొత్తం అమలయ్యేలా చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పించారు.

అనంతరం నిమ్మకూరు గ్రామస్తులతో చంద్రన్న’ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నందమూరి కుటుంబం తరపున చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని, నందమూరి రామకృష్ణ కొత్త వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ఓ బుడ్డోడు పాంచాలి… పంచ భర్తృక డైలాగ్‌ చెప్పి చంద్రబాబును ఫిదా చేశాడు. ఆ పిల్లాడిని చంద్రబాబు అభినందించి సన్మానం చేశారు.

ఎన్టీఆర్‌ నడయాడిన నేలపై తాము తిరగడం ఆనందంగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి యుగపురుషుడిగా చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.

సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిరారని తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు వాడికి గౌరవం దక్కిందంటే నాడు ఎన్టీఆర్‌, నేడు చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పారు.

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో వంద సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రిలో వందో సభ ఎన్టీఆర్‌ జయంతి రోజున చాలా ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని అచ్చెన్నాయుడు కోరారు.