Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విశాఖ స్టీల్‌….కెసిఆర్‌ ఉక్కు పిడికిలి ! 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్టాల్ర రాజకీయాలు నడుస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నామని స్వయంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్టాల్ర మధ్య రాజకీయ రగడ మొదలయ్యింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ అధికార బృందాన్ని కూడా పంపింది.

ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహరాంలో బిడ్డింగ్‌లో పాల్గొనాలన్న కెసిఆర్‌ వ్యూహంతో అటు బిజెపి, ఇటు వైసిపి గిలగిలాడుతున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా కెసిఆర్‌ వ్యూహం పన్నారని రాజకీయాల్లో తలపండిన వారు సైతం అంగీకరించాల్సిందే.

గతంలోకి వెళితే..ఎపిలో జగన్‌ సిఎం అయ్యాక హైదరాబాద్‌కు వచ్చి సిఎం కెసిఆర్‌తో అలయ్‌భలయ్‌ జరిపారు. కలసి పనిచేద్దామనుకున్నారు. సాగునీటి సమస్యలను కూర్చుని పరిష్కరించుకుందామని అనుకున్నారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. తరవాత  ఇద్దరి మధ్యా దూరం పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీని పెట్టాక ఎపిలోనూ కాలుమోపేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణకు నడుం బిగించారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ, తెలంగాణలో సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతోందన్న వార్తలు తెలుగు రాష్టాల్ర ప్రజలను ఆందోళనలో పడేశాయి.

ఈ పరిస్థితుల్లో స్టీల్‌ ఫ్యాక్టరీని ఆదుకుంటామని.. బిడ్‌ వేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌ సర్కార్‌ చేసిన ఒకే ఒక ప్రకటన ఇప్పుడు పెను సంచలనమే అయ్యింది. అయితే.. అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ అర్హతే లేదని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయినప్పుడు బిడ్డింగ్‌ లో తెలంగాణ సర్కార్‌ ఎలా పాల్గొంటుంది..? అని ప్రశ్నిస్తోంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకమని వైసీపీ తేల్చి చెప్పేసింది. ఎలా కుదురుతుందని వైసిపికి చెందిన మంత్రి అమర్‌నాథ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సలహాదారు సజ్జల కూడా జగన్‌ విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నారంటూ సంకేతాలు ఇచ్చినా..తెలంగాణ ప్రవేశాన్ని జీర్ణించు కోలేమన్న విషయాన్ని పరోక్షంగా తెలియ చేశారు. దీంతో ఇన్నాళ్లుగా కలిసి మెలిసిన వైసీపీ`బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఇప్పుడు ఒక్కసారిగా బద్ద శత్రువులగా మారిపోయాయి.

సింగరేణి ద్వారా బిడ్‌లో పాల్గొని.. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవడం ద్వారా ఎపిలో పాగా వేయాలని కెసిఆర్‌ అనుకుంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కెసిఆర్‌, కెటిఆర్‌లు మాట్లాడగానే ఎపిలో ఒక్కసారిగా పరిస్థితి కెసిఆర్‌కు అనుకూలంగా మారింది. అయితే ఉక్కును రక్షించా లని, తెలుగు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని చెప్పగానే ఎందుకనో ఎపి మంత్రులు విమర్శలకు దిగారు.

విశాఖ ఉక్కు విషయంలో తెలంగాణ జోక్యాన్ని సహించలేక పోతున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ఎంతో అన్యోన్యతగా ఉంటూ వచ్చాక ఇప్పుడు విశాఖ ఉక్కు చిచ్చు పెట్టిందా..అన్న అనుమానాలు వస్తున్నాయి.

విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మకుండా అడ్డుపడితే సంతోషించాల్సిన జగన్‌ ఎందుకు పుల్ల వేస్తున్నారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. గతకొంత కాలంగా ఇద్దరు సిఎంల మధ్య మధ్య గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది. దీనికితోడు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌ ఒకలా.. హరీష్‌ రావు ఆంధ్రుల విషయంలో మాట్లాడిన మాటలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారాయి.

అయితే.. అస్సలు తెలంగాణ ప్రభుత్వం బిడ్‌ వేయడమనేది జరిగే పని కాదని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అనేవాళ్లు బిడ్‌ ఎలా వేస్తారని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. బిడ్డింగ్‌కు అర్హతే లేదని కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ చెబుతోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ తెలంగాణ మంత్రులు కేటీఆర్‌`గుడివాడ అమర్నాథ్‌ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.

ALSO READ: బలపడిన రూపాయి

అయితే.. ఏపీలో బీఆర్‌ఎస్‌లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జగన్‌ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రజల్లో సానుభూతి పొందాలనే కేసీఆర్‌ సర్కార్‌ పక్కా వ్యూహంతో అడుగులు ముందుకేస్తోందని వార్తలు వస్తున్నాయి.

రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్‌.. ఆషామాషీగా ఏ పనిచేయరని తెలుసు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కూడా కేసీఆర్‌ ముందుస్తు వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారనే అనుకోవాలి. ఇక్కడ కేంద్రాన్ని దెబ్బకొట్టడంతో పాటు, ఎపిలో పాగా వేయాలన్న దూరదృష్టితో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై రాజకీయ రచ్చ నడుస్తుండగానే మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలు మరోమారు రాజకీయ దుమారాన్ని రేపాయి. తెలంగాణలోని ఏపీ కార్మికులు ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోవాలని.. ఇక్కడ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడు తోందని.. ఏపీ, తెలంగాణలో ఎవరి పాలన బాగుందనేది ప్రజలే చెప్పాలని కూడా అనేశారు.

ఏపీ, తెలంగాణకు.. భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా..? అని హరీష్‌ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్టాల్ర మధ్య మరింత ఆజ్యం పోసింది. దీనిపై మరోమంత్రి కారుమూరి నాగేశ్వర రావు విమర్శలు సంధించారు. అంతేగాకుండా మరోమారు హరీష్‌ అసలు ఆంధ్రాలో ఏముందని అంటూ ఘాటుగానే స్పందించారు.

అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణకు మించిన మాడల్‌ లేదని స్పష్టంచేశారు. ఏపీని గాలికొదిలిన అధికార, విపక్షాలు.. విశాఖ ఉక్కును అమ్ముతున్నా ఉలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు. నాడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. ఇవాళ కేంద్రం హోదాను ఎగబెట్టినా ఏపీలోని అధికార పక్షం అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు.

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ, వైసీపీ పాకులాడుతున్నాయి. అక్కడి పార్టీలు ప్రజలను గాలికి వదిలేశాయి. తమ స్వార్థం కోసమే పనిచేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తాజాగా విమర్శలు గుప్పించారు.

మొత్తానికి ఒక రాజకీయ వ్యూహంతోనే కెసిఆర్‌, కెటిఆర్‌, హరీష్‌ రావులు అడుగులు వేస్తున్నారన్నది సుస్పష్టం. ఎపిలో అడుగు మోపడానికి ప్రాతిపదికను సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసిపిని, బిజెపిని ఏక కాలంలో దెబ్బతీయాలన్న కెసిఆర్‌ వ్యూహం దాగివుంది.