Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేవుళ్ల రథాలపై మరింత నిఘా..

ద్వారకా తిరుమల: ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తుల రథాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవోను జారీ చేసింది. దీంతోపాటు హిందూ ఆలయాల్లో ఉండే రథాలపై నిఘా మరింతగా పెంచాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రధాన ఆలయాలకు సంబంధించిన రథాలను, అవి ఉండే ప్రాంతాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆలయ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న రథాన్ని, అలాగే క్షేత్ర ఉపాలయాలైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామివారి రథాన్ని, వాటి రథ శాలలను భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ద్వారకాతిరుమల ఇన్చార్జి ఎస్సై శ్రీహరిరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రథాల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను శ్రీవారి దేవస్థానం ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణ వారికి వివరించారు.