Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చీకటి పల్లెల్లో వెలుగులు నింపిన సూర్యుడు అంబేద్కరుడు.

ఏ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు, ఆచరణ, నాయకత్వం మరియు సామాజిక అంగీకారాన్ని నిర్వహించే తత్వశాస్త్ర (తాత్విక సిద్ధాంతం) సూత్రాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించిన గొప్ప ఉద్యమ నాయకుడు ‘డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్’.

డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అసమాన విద్యావేత్త, దళిత హక్కుల పోరాట యోధుడు, మేధావి, దార్శనికుడు, గొప్ప దేశభక్తుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, పరిపాలన ప్రవీణుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రచయిత, భారత రత్న, న్యాయ నిపుణుడు, బహుభాషావేత్త, సామాజిక అసమానతలను రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. అంటరానితనంపై, అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు.

డా.బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.

ఓటు హక్కు ప్రదాత:

ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు. సామాన్యులు తమపై ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారని ఉన్నతవర్గాలు భావించాయి. సార్వత్రిక ఓటు హక్కుకు అడ్డంకులు ప్రపంచంలోని అనేక దేశాల్లో, మహిళలు, ఆస్తిలేనివారు మరియు జాతి మైనారిటీలకు ఓటు హక్కు నిరాకరించబడింది. చరిత్రకారుడు అలెగ్జాండర్ KSR “ఓటు హక్కు” పుస్తకంలో పేర్కొన్న ప్రకారం, అమెరికాలో కూడా సార్వత్రిక ఓటు హక్కు అనేక ఉద్యమాల తర్వాత కూడా ప్రజలకు చేరలేదు.

Also Read: రాత్రి 11 గంటల వరకు గ్రంధాలయాల్లోనే

అన్ని దేశాల్లాగే భారతదేశంలో కూడా మొదటగా అందరికీ ఓటు హక్కు లభించలేదు. పన్ను చెల్లింపుదారులు మరియు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) సహా కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన అంబేద్కర్ 1919లో సౌత్ బోరో కమిటీకి తన పిటిషన్‌లో “ప్రాతినిధ్య హక్కు మరియు రాజ్యాంగ హోదా హక్కు పౌర హక్కులలో అత్యంత ముఖ్యమైనవి పౌరసత్వం మరియు రాజకీయాల్లో సభ్యత్వం కోసం ఓటు హక్కు అని పేర్కొన్నాడు. ఓటు హక్కు వల్ల బడుగు బలహీన వర్గాలవారికి రాజకీయ చైతన్యాన్ని తెస్తుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ జీవితాల జోలికి వెళ్లని వారి విముక్తికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. అంబేద్కర్ పేర్కొన్న ఈ రెండు అంశాలు భారత రాజ్యాంగం ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కుకు వెన్నెముక. అంబేద్కర్ 1930లో మరియు తరువాత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్‌ను లేవనెత్తడానికి తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించారు. ఓటు హక్కు అనేది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి అవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత ఆధారంగా ఓటు హక్కు కల్పించడాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత అగ్రనేతల సహాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ని ప్రవేశపెట్టడం జరిగింది. అయన ప్రవేశపెట్టడం వల్లే వర్గ, లింగ, కుల, కులాలకు అతీతంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభిస్తుంది. ఈరోజు మనం ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నకుంటున్నామంటే ఇది అంబేద్కర్ కృషి ఫలితం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఓటు ప్రాముఖ్యతను గుర్తించి దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది. దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటే ఆధారం. ఓటును డబ్బుకు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనే రెండక్షరాలు దేశ భవిష్యత్తుకి పునాది.

పంచాయతీరాజ్ వ్యవస్థ :

భారత గణతంత్ర 70 ఏళ్ల సుదీర్ఘ పాలన లో పంచాయత్ రాజ్ వ్యవస్థ గొప్ప విజయం. ఢిల్లీ పాలన ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్ లక్ష్యంతో ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను చాలా వరకు సాధించింది. జనాభాలో సగం మంది మహిళలు మరియు ప్రస్తుతం 50% స్థానిక సంస్థలను పరిపాలిస్తున్నారు. గ్రామానికి దూరంగా..వివక్షతో జీవించే దళితులు కూడా అధికారంలో భాగమయ్యారు. ఇలా ఎన్నో విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వాటన్నింటినీ పరిష్కరించగలిగితే భారత్ ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందనడంలో సందేహమే లేదు.

ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరింప చేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం:

1927లో మహద్‌లో అంటరానితనానికి వ్యతిరేకంగా మంచినీరు, దేవాలయాల ప్రవేశం కోసం పెద్దఎత్తున మంచినీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. 1927 డిసెంబర్ 25 న తన వేలాది మంది అనుచరులతో కలిసి దేశంలో కుల వ్యవస్థకు పునాదులు వేసిన సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతిని తగులబెట్టాడు. 1930లో 15,000 మంది వాలంటీర్ల సహాయంతో మిలటరీ బ్యాండ్ స్కౌట్ బృందం కలరామ్ ఆలయ ఉద్యమాన్ని ప్రారంభించగా, మహిళలంతా క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని చేసి తొలిసారిగా దేవుడిని దర్శించుకున్నారు. ఆర్టికల్ 17 ద్వారా అంటరాన్నితనాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించారు.

భారత రాజ్యాంగ నిర్మాత:

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అనేక సాయుధ పోరాటాలు మరియు అహింసా పద్ధతులలో అనేక ఇతర ఉద్యమాల తరువాత, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆగష్టు 14, 1947 అర్ధరాత్రి, భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. అప్పుడు మనకు సమగ్రమైన, లిఖితపూర్వకమైన రాజ్యాంగం లేనందున, ఏ మార్గాన్ని అనుసరించాలనేది ప్రశ్నగా మారింది. అయితే నియంతృత్వమైనా, సైనిక పరిపాలన, సార్వభౌమాధికారమైనా, రాచరికమైనా.. స్వపరిపాలనపై అనేక ప్రశ్నలు తలెత్తాయి, వీటన్నింటికీ సమాధానమే భారత రాజ్యాంగం. , 1950 జనవరి 26 న సర్వ సత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

అసమానతలు, అవమానాలు మరియు అన్యాయాలను ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలు మరియు అణగారిన వర్గాల సామాజిక గౌరవం మరియు భద్రతకు ప్రధాన ప్రాతిపదిక అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ క్రియాశీల పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ఆయన, సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దుర్భర జీవితం గడిపిన వారికి అన్ని రకాల రక్షణ, భద్రత కల్పించారు.

కుటుంబ నేపథ్యం:

అంబేద్కర్ మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని అంబవాడే గ్రామంలో భీమాబాయి మరియు రాంజీ మలోజీ సక్వాల్ దంపతులకు 1891 ఏప్రిల్ 14 వ తేదీన జన్మించారు. అంబేద్కర్ తండ్రి భారత సైన్యంలో అధికారి. వారి ఇంటిపేరు “అంబవడేకర్”. బ్రాహ్మణుడైన అతని గురువు మహదేవ్ అంబేద్కర్ అతనిపై అభిమానంతో అతని ఇంటిపేరును ‘అంబవడేకర్’ నుండి అతని ఇంటిపేరు ‘అంబేద్కర్’గా మార్చారు ఆ పేరే ఆయనకు స్థిరనామమయింది.

విద్యాబ్యాసం మరియు ఎదుర్కున్న సమస్యలు:

సమాజంలో నిమ్న కులంగా భావించే మహర్ (దళిత) కులంలో జన్మించిన అంబేద్కర్ బాల్యంలో అనేక అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలాన కూర్చోబెట్టేవారు. మంచినీళ్లు తాగే సందర్భంలో కూడా అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో తనను ఇబ్బంది పెట్టిన సమాజంలో అందరికన్నా గొప్ప మేధావిగా, విద్యావంతునిగా ఎదగాలనే పట్టుదలతో రాత్రీ పగలు తేడా లేకుండా నిరంతరం చదువులోనే జీవితాన్ని గడిపిన అంబేద్కర్. తండ్రి రామ్‌జీ పదవీ విరమణ తరువాత అంబేద్కర్ కుటుంబం సతారాకు వెళ్లి అక్కడ నివాసం ఉంది. అయితే కొంతకాలానికి తల్లి మరణించడంతో అంబేద్కర్ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది.

1907 లో ముంబైలోని ఎల్‌ఫన్‌స్టోన్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు.

1908లో అదే కాలేజీలో చేరి కాలేజీ విద్యను పూర్తిచేశారు.

1912లో బాంబే యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.

1913 లో బరోడా మహారాజ్ అందించిన సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. అదే సమయంలో భారతదేశం వాణిజ్యం, భారతదేశంలోని మతాలు, పుట్టుపూర్వతరాలు అనే పరిశోధన వ్యాసాలు వ్రాసాడు అంతేకాకుండా ‘భారతదేశం జాతీయాదాయం చారిత్రక పరిశీలన’ సిద్ధాంత గ్రంధం వ్రాసి పి. హెచ్. డి పట్టా పొందారు. ఆతరువాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అయ్యారు.

1916లో లండన్ వెళ్లి ఎంఏ (నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ) పూర్తిచేయడమే కాకుండా ఎకానామిక్స్‌లో పీహెచ్‌డీ కూడా సంపాదించారు.

1918లో ముంబైలోని సైదన్‌హమ్ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో పొలిటికల్ ఎకానమీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

1921లో మాస్టర్ డిగ్రీని (ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రుపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్).

1923లో ఎకనామిక్స్‌లో డీఎస్సీ పూర్తిచేశారు. ఆతరువాత భారతదేశానికి తిరిగివచ్చిన అంబేద్కర్ బరోడా సంస్థానంలో మిలిటరీ సెక్రటరీగా నియామకమయ్యారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. చివరకు కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేశాడు.

1952 లో ఎల్‌ఎల్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.

1953 లో డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, గౌరవపట్టా) పొందారు.

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా.. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీడిత వర్గాల విముక్తి, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు.

వ్యాసకర్త
కోట దామోదర్
మొబైల్ : 9391480475