Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కర్నాటకలో కాలం కలసి వచ్చేనా ?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరంతరాయంగా ఆదరించడానికి కూడా బలమైన కారణాలు ఉండాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఎల్లవేళలా అండగా నిలవవు. అలాగే ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమాలతో అధికారం సొంతం చేసుకోవడం కొంతవరకే చెల్లుతుంది.

ఇప్పుడు కర్నాటకలో బిజెపి పరిస్థితి అలాగే ఉంది. డబుల్‌ ఇంజిన్‌ పేరుతో మభ్యపెట్టినా..ప్రజలకు బిజెపి అంటే పెద్దగా మక్కువ చూపడం లేదు. గతంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ ప్రభుత్వాలకు భిన్నంగా ..గొప్పగా బిజెపి పాలన లేదు. ఈ క్రమంలో తాజాగా జరుగబోతున్న ఎన్నికలు బిజెపికి అంత సునాయస విజయాన్ని సాధించి పెడతాయని అనుకోవడానికి లేదు.

ఇవాళ కర్ణాటకలో గెలిచేందుకు మళ్లీ యడ్యూరప్పపై ఆధారపడడం, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాననడం చూస్తుంటే..బిజెపి ప్రభ ఏపాటిగా ఉందో తెలుసు కోవచ్చు. ఇదొక్కటే కాదు.. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తప్ప వేరే గత్యంతరం లేదు.

రాజస్థాన్‌లో వసుంధరారాజే ఆధిపత్యానికి తలొగ్గి ఆమెకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరగుతోంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న అంశాలపై చర్చ జరిగితే తమ బలహీనతలు బయట పడతా యేమోనని భయపడడం సస్పష్టంగా చూస్తున్నాం.

ALSO READ: ఆత్మీయ సమ్మేళనం… టపాసులు.. గుడిసె పై పడి… సిలిండర్ పేలి… ఎనిమిది మంది

కార్పొరేట్‌ సంస్థలే రాజకీయాలు, విధానాలు నిర్ణయించే స్థితికి రావడం దౌర్భాగ్యం కాక మరోటి కాదు. చివరకు తమ ప్రత్యర్థిగా ఎదుగుతున్న రాహుల్‌ గాంధీపై పాత కేసును త్రవ్వి తీసి ఆయనకు శిక్షపడేలా చేసి పార్లమెంట్‌ నుంచి బహిష్కరించడం వంటి పరిణామాల ద్వారా మోదీ, అమిత్‌ షాల ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

సోషల్‌ విూడియాలో బిజెపి ప్రతిష్ట పెరుగుతుందనే భ్రమలు కల్పించడం..దేశాన్ని ఉద్దరించామని చెప్పు కోవడం మినహా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితుల్లో బిజెపి నాయకద్వయం లేదు. ఈశాన్య రాష్టాల్ల్రో విజయ గర్వంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్ష కాబోతున్నాయి.

దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఏకైక రాష్ట్రంలో తిరిగి అధికారం నిలబె ట్టుకోవడం ఇప్పుడు అగ్నిపరీక్ష కాబోతున్నది. అధికారంలో ఉన్న పార్టీని తిరిగి నెగ్గించే అలవాటు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ లేదు. 2008 ఎన్నికల్లోనూ, 2019లోనూ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేదు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే నేతలు మెజారిటీ మార్కు దాటేస్తామని నమ్ముతున్నారు.

సర్వేలు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ప్రచారంలో ఉంది. కాంగ్రెస్‌ విజయం ఖాయమని కొన్ని తేల్చేస్తే, బీజేపీ కాంగ్రెస్‌ హోరాహోరీ తప్పదని మరికొన్ని స్పష్టంచేస్తున్నాయి. పోటీ తీవ్రత బీజేపీ పెద్దలకు తెలియంది కాదు. ఎన్నికల ప్రకటనకు ఎంతోముందుగానే ఆరంభమైన కేంద్రపెద్దల పర్యటనలు, మోదీ ఏడుపర్యాయాల పర్యటనలు, శంకుస్థాపనలు, హడావుడి ఆరంభాలు ఆ పార్టీలో ఉన్న ఆందోళనలను తెలియచేస్తున్నాయి.

మరోవైపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి, బలమైన లింగాయత్‌, వొక్కళిగ కులాలకు చెరో రెండుశాతం పంచింది. అధికార పక్షంవిూద ప్రజావ్యతిరేకత అత్యధికంగా ఉన్నదని సర్వేలు చెబుతున్న తరుణంలో ఈ చర్యలు, హావిూలు పార్టీని గ్టటెక్కిస్తాయో లేదో చూడాలి.

బీజేపీకి ఈ రాష్ట్రంలో విజయం దాని అప్రతిహత గమనానికీ, రాజకీయాధిపత్యానికీ కీలకం. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా విస్తరించివున్న స్థితిలో, కొత్తవ్యాప్తి అవకాశాలు తక్కువగా ఉన్న దశలో, కర్ణాటకలో ఓటమి దానికి ప్రమాదం. పార్లమెంటు స్థానాలను మూటగట్టి మరీ ఇస్తున్న కర్ణాటక తన పక్షాన ఉంటే, సార్వత్రక ఎన్నికల్లో దేశంలోని ఇతరచోట్ల పొరపాటున నష్టాలు సంభవించినా పెద్ద సమస్య ఉండదు.

’ఆపరేషన్‌ కమలం’తో అడ్డుతోవల్లో అధికారంలోకి రావడం తప్ప, నేరుగా ఎప్పుడైనా గెలిచిందా అన్న ప్రశ్నకు ఈ ఎన్నికల్లో బీజేపీ సమాధానం ఇవ్వగలిగితే, తెలుగు రాష్టాల్ల్రో పోరాడే ధైర్యం, స్థైర్యం మరింతగా సమకూరుతాయి. వరుస పరాజయాలు చవిచూస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటక ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది.

రాజకీయంగా నిలబడాలన్నా, విపక్షంలో పెద్దగా ఉండాలన్నా, సార్వత్రక ఎన్నికలకు కదనోత్సాహంతో కదలాలన్నా ఈ పరీక్షలో కాంగ్రెస్‌ నెగ్గాల్సిందే. ఎన్నికలు ఏ స్థాయివైనా నిత్యసంసిద్ధతతో నిలబడే బీజేపీతో కలబడేందుకు సార్వత్రక ఎన్నికలవరకూ కలబడాలన్నా కర్నాటకలో కాంగ్రెస్‌ సత్తా చాటితేనే భవిష్యత్‌ ఉంటుంది. అప్పుడే గెలిచే పార్టీకి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు కూడా కర్ణాటక కొత్తశక్తిని ఇస్తుంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ బలహీనంగా ఏవిూ లేదు. వ్యవస్థాగత పునాది, బలమైన స్థానిక నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిద్దరామయ్య, శివకుమార్‌ మధ్య ఆధిపత్య పోరాటం ఉన్నా ఇద్దరూ బలమైన నేతలే. మల్లికార్జున్‌ ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉండడం కర్ణాటకలోని దళితులను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నారు.

బీజేపీ పాలన అత్యంత అవినీతిమయమైనదిగా ప్రచారం చేస్తూ, ఉచిత విద్యుత్‌, ప్రతీ గృహిణికీ రెండువేల రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి ఇత్యాది ఆకర్షణీయమైన హావిూలు గుప్పిస్తూ కాంగ్రెస్‌ యుద్ధం చేస్తోంది.

గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్‌ ఓటువాటా రెండుశాతం హెచ్చిందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో, ప్రతికూలతలను అధిగమించి రాబోయే రోజుల్లో మరింత సానుకూలతను సాధించగలిగితే కాంగ్రెస్‌ గట్టెక్కగలదని విశ్లేషిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో జోడోయాత్ర ప్రభావం ఎంతో,రాహుల్‌ ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో ప్రజల మనోభిప్రాయం ఏమిటో కర్ణాటక ఫలితాల్లో తేలనుంది.