Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డిస్కమ్‌ల ద్వారా భారం మోపుతున్న కేంద్రం

మోడీ ఏకపక్ష నిర్ణయాలతో నష్టం
బొగ్గు దిగుమతి విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తిలో భారం
విషయాలను కేంద్రం దృష్టికి తెచ్చిన పట్టింపు ఏదీ?
అమరావతి,ఏప్రిల్‌8(ఆర్‌ఎన్‌ఎ): ప్రధానమంత్రి మోడీ ఏకపక్షంగా పునరుత్పత్తి విద్యుత్తు (ఆర్‌.ఇ) లక్ష్యాలను ప్రకటించడం భారంగా మారిందని ఎపి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మితివిూరిన లక్ష్యాలకు మించి డిస్కాములు కొనుగోలు చేయటం వల్ల నివారించదగిన అదనపు భారాలు వినియోగదారులపై పడుతున్నాయి. ఈ విధానాన్ని డిస్కాములపై రుద్దుతున్న కేంద్రం ఈ భారాల నివారణకు, తగ్గింపునకు ఎలాంటి సహాయం చేయటం లేదు.

బొగ్గు దిగుమతి చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ఆదేశిస్తున్న మోడీ ప్రభుత్వం, అందుకయ్యే అధిక వ్యయం భారాన్ని వినియోగదారులపై తగ్గించేందుకు ఎలాంటి సహాయం చేయటం లేదు. సాంకేతిక కారణాలను మినహాయించి, డిస్కాంలు వినియోగదారులకు విద్యుత్తును నిరంతరం సరఫరా చేయటంలో విఫలమైతే జరిమానాలను చెల్లించాలనే దాకా మోడీ ప్రభుత్వం వెళ్ళింది.

విద్యుత్‌ ప్రాజెక్టులకు తాను చేసిన కేటాయింపుల మేరకు బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాలను సరఫరా చేయించటంలో విఫలమౌతూ, వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తూ, వాటి ధరలను సహేతుకంగా నియంత్రించటంలో, తగు రవాణా ఏర్పాట్లు చేయించటంలో విఫలమౌతూ, విద్యుత్‌ కొరతకు కారణమవుతున్న తన వైఫల్యాలకు మాత్రం మోడీ ప్రభుత్వం ఎలాంటి బాధ్యత, జవాబుదారీతనం వహించటం లేదు.

ALSP READ: సింగరేణి …..మరో విశాఖ ఉక్కు కారాదు !

తన విధానాలు, వైఫల్యాల వల్ల డిస్కామ్‌లపై, వినియోగదారులపై పడుతున్న భారాలను తగ్గించేందుకు ఎలాంటి సహాయం అందించటం లేదు. అసాధారణంగా ఆర్‌.ఇ ని గ్రిడ్‌లో చేర్చేందుకు యూనిట్‌కు రూ.3.55 చొప్పున ఏటా 5325 కోట్ల రూపాయల భారం పడుతు న్నదని, ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు విపరీతంగా పెరిగి రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటున్నదని నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె సింగ్‌కు 2019 సెప్టెంబరు 10న రాసిన లేఖలో వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలను చెల్లిస్తున్నట్లు గానే, కేంద్ర ప్రభుత్వం కూడా తన పవన, సౌర విద్యుత్‌ ప్రోత్సాహక విధానాలకు చెల్లించటం సముచితమని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

పవన విద్యుత్తుకు యూనిట్‌కు 50 పైసల చొప్పున ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం కల్పించటం మినహా కేంద్రం ఇంకే సహాయం చేయటం లేదు. 2018లో అప్పటి ఎ.పి.ఇ.ఆర్‌.సి డిస్కామ్‌ల నుండి ఎటువంటి ప్రతిపాదన లేకుండా, బహిరంగ విచారణ కూడా లేకుండా తనంత తాను పవన విద్యుత్తు యూనిట్‌కు రూ.4.84 చొప్పున అధిక జనరిక్‌ టారిఫ్‌ను ఏకపక్షంగా నిర్ణయించింది.

ఆనాడు పోటీ బిడ్డింగు ద్వారా దేశంలో పవన విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.3.50 వరకు తేలాయి. ఎ.పి.ఇ.ఆర్‌.సి జిబిఐని పవన విద్యుత్తుకు చెల్లించాల్సిన చార్జీల నుండి తగ్గించకుండా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ డిస్కాములు అప్పీలు చేశాయి. దానిపై జిబిఐ మొత్తాన్ని జనరిక్‌ టారిఫ్‌ నుండి తగ్గిస్తూ కమిషన్‌ ఉత్తర్వునిచ్చింది.

పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులు దానిని సవాలు చేస్తూ హైకోర్టులో కమిషన్‌ ఉత్తర్వుపై పొందిన స్టే ఇంకా కొనసాగుతున్నది. అవసరం లేని ఆర్‌ఇ కొనుగోలు వల్ల విపరీతంగా మిగులు విద్యుత్‌ తేలి, వినియోగ దారులపై ట్రూఅప్‌ రూపంలో భారాలు పడుతున్నాయి. వాటిని తగ్గించేం దుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటం లేదు.

మిగులు విద్యుత్తుతో విద్యుత్‌ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉన్న మేరకు రాష్టాల్రు పిపిఎల ప్రకారం పొందని విద్యుత్‌కు స్థిర ఛార్జీలను వేల కోట్ల రూపాయల మేరకు చెల్లించాల్సి వస్తున్నది. ఆ భారాలు వినియోగదారులపై పడుతున్నాయి.

ఇది ఆందోళనకర అంశమని పేర్కొంటూ, అలా చెల్లిస్తున్న స్థిర ఛార్జీల నిమిత్తం కేంద్రం సహాయం అందించాలని ఫోరం ఫర్‌ రెగ్యులేటర్స్‌ సిఫార్సు చేసింది. కేంద్ర ప్రణాళికా నిధులను సమకూర్చుతున్న పద్ధతిలోనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని 60:40 నిష్పత్తిలో భరించాలని ఫోరం సిఫార్సు చేసింది.

మోడీ ప్రభుత్వం నుండి దీనిపై ఎలాంటి హావిూ దక్కలేదు. స్వచ్ఛ ఇంధన సుంకాన్ని టన్ను బొగ్గుకు రూ.400 చొప్పున కేంద్రం వసూలు చేస్తున్నది. దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందని, పరిసరాల నియమాలను పాటించేందుకయ్యే ఖర్చుల నిమిత్తం సియిఎస్‌ మొత్తాన్ని విద్యుత్‌ రంగానికివ్వాలని ఫోరం సిఫార్సు చేసింది.

సియిఎస్‌ను కేంద్రం జిఎస్‌టిలో చేర్చి వసూలు చేస్తున్నది. బొగ్గు, సహజ వాయువు ధరలను సహేతుకంగా నిర్ణయిం చాలని, ఇందుకు స్వతంత్ర రెగ్యులేటర్ను నియమించాలని ఫోరం సిఫార్సు చేసింది.

బొగ్గు రవాణాకు రైల్వే చార్జీలలో కేంద్రం సబ్సిడీ యిచ్చే అంశాన్ని పరిగణించాలని సిఫార్సు చేసింది. కేంద్రం చేసిన కేటాయిం పుల మేరకు సహజ వాయువును సరఫరా చేయించక పోవటంతో, ఆ ఇంధనంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నాయి.

అయినా, పిపిఎల నిబంధనల ప్రకారం డిస్కాంలు వాటికి స్థిర ఛార్జీలను చెల్లించాల్సి వస్తున్నది. ఈ స్థిర చార్జీలను చెల్లించేందుకు కేంద్రం డిస్కాంలకు సహాయం అందించాలని ఫోరం సిఫార్సు చేసింది.

మోడీ ప్రభుత్వం ఈ సహేతుక సూచనలను పట్టించుకోకుండా యథావిధిగా మొరాయిస్తున్నది. వ్యవసాయేతర విద్యుత్‌ కనెక్షన్లకు ముందస్తు చెల్లింపు ప్రీ పెయిడ్‌ విూటర్లను ఏర్పాటు చేయటం, మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలను 12`15 శాతానికి తగ్గించటం, సగటు కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ కు, మొత్తం రెవెన్యూ అవసరాలకు మధ్య తేడాను పూర్తిగా తగ్గించి వేయటం ఈ పథకం లక్ష్యాలు. డిస్కామ్‌లు ఈ పథకాన్ని అమలు చేస్తే, ప్రీ పెయిడ్‌ విూటర్ల కొనుగోలుకు విూటరుకు రూ. 900 చొప్పున గ్రాంట్‌గా ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది.

ప్రీ పెయిడ్‌ విూటర్ల వల్ల వినియోగదారులకు చేకూరే లాభం ఏవిూ లేదు సరికదా చేతి చమురు వదులుతుంది. విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రవేశించే ప్రైవేటు పెట్టుబడిదారుల పబ్బం గడిపేందుకే ఈ ప్రీ పెయిడ్‌ విూటర్లను ఏర్పాటు చేయించేందుకు గ్రాంటును కేంద్రం ఎరగా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వాల డిస్కామ్‌లను నేరుగా ప్రైవేటీకరించే అధికారం తనకు లేకపోవటంతో మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నది.