Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సింగరేణి …..మరో విశాఖ ఉక్కు కారాదు !

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ ..ప్రధాని మోడీ రాకను పురస్కరించుకుని ..సింగరేణిలో మహాధర్నాకు అధికార బిఆర్‌ఎస్‌ పిలుపునివ్వడంతో ధర్నాలు చేపట్టారు. ఎక్కడిక్కడన నిరసనలు సాగాయి. మోడీ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి.

సింగరేణిని బతికించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు తరహాలో..సహాయక పనులను నిరాకరించడం ద్వారా ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని మంత్రి కెటిఆర్‌ తదితరులు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.

ఉక్కు ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మేస్తున్నారు. కోట్లాది విలువైన భూములను అప్పగించేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గు మాలిన పని మరోటి ఉండబోదు. ఎపిలోని జగన్‌ ప్రభుత్వం కూడా దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఎపిలో అనేక ప్రాజెక్టులను ఆదానీకి అప్పగించడంలో జగన్‌ ముందున్నారు.

ALSO READ: బలగం దర్శకుడు వేణుకు అమెస్టర్‌ డామ్‌ అవార్డు

ఇలాంటి తరుణంలో తనకు తిరుగులేక పోవడంతో మోడీ విశాఖ ఉక్కు గొతు పిసికేస్తోంది. దీనికి వ్యతిరేకత లేకపోవడంతో ఇప్పుడు సింగరేణిపైనా అదే తరహా కుయుక్తులు పన్నుతున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నిజంగానే సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని..గతంలో రామగుండం పర్యటనలో ప్రధాని స్వయంగా ప్రకటించారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజంగానే ఇందులో నిజం ఉందా లేదా అన్నది బిజెపి నేతలు వెల్లడిరచారు. సింగరేణి బొగ్గు గనులను ఆదానీకి అప్పగించే కుట్ర సాగుతోందని అంటున్నారు.

ఇది నిజమే అయితే ..ఆదానీకి అండగా మోడీ ఉన్నాడన్నది నూటికినూరుపాళ్లు ఖచ్చితంగా నమ్మాల్సిందే. సింగరేణిని ప్రైవేటీకరిస్తే..నిజంగానే ఇది మోసం చేసినట్లుగానే భావించాలి. అయితే ఇందులో బిఆర్‌ఎస్‌ చెప్పేది నిజమా లేక..కేంద్రం చెప్పేది నిజమా అన్నది తేలాల్సి ఉంది.

 

సింగరేణి విద్యుత్‌ ఉత్పత్తిలో ముందున్నది. ఇక్కడి బొగ్గుతోనే థర్మల్‌ స్టేషన్‌ నడుస్తోంది. నిరంతర విద్యుత్‌కు ఇది ఎంతగానో తోడ్పడుతోంది. ఇలాంటి సింగరేణి చేజారితే తెలంగాణ భవిష్యత్‌ దెబ్బతినగలదు. ఇకపోతే కేంద్రం అనుసరిస్తున్న విద్యుత్‌ విధానం వల్ల నేటికీ ప్రజలకు నిరంతర విద్యుత్‌..నాణ్యమైన విద్యుత్‌…చౌకయిన విద్యుత్‌ అందడం లేదు. ఈ విషయంలో తెలంగాణ మాత్రమే ఆదర్శంగా ఉంది.

తెలంగాణలో ఎంత కష్టమయినా కెసిఆర్‌ నిరంతర విద్యుత్‌ అందిస్తున్నారు. కానీ నేటికీ కేంద్రం విద్యుత్‌ విధానం సమగ్రంగా లేదు. వేలాది గ్రామాలు నేటికీ విద్యుత్‌ కోసం ఎదురు చూస్తున్నాయి.

నిరంతర విద్యుత్‌ అన్నది మిథ్యగా మారింది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్టాల్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీలను (డిస్కామ్‌) గ్టటెక్కించే పేరుతో షరతులతో కూడిన పథకాలను కేంద్రం ప్రవేశపెడుతున్నది.

డిస్కాముల పేరుకుపోయిన నష్టాలు, అప్పులలో అధిక భాగం రాష్ట్ర ప్రభుత్వా లు భరించటం ఈ పథకాల సారాంశం. ఆర్థిక పునర్నిర్మాణ పథకం, ఉజ్వల్‌ డిస్కాం ఎస్యూరెన్స్‌ యోజన (ఉదరు), అందరికి విద్యుత్‌ వంటి పథకాలను కేంద్రం ప్రతిపాదించింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి డిస్కాములతో ఒప్పందాలపై సంతకాలు చేయించింది.

ఈ పథకాల ప్రకారం ఉభయ తెలుగు రాష్టాల్రు గత ఎనిమిదేళ్ళుగా వేలకోట్ల రూపాయల మేరకు వాటి డిస్కాముల పేరుకుపోయిన నష్టాలను, అప్పులను భరిస్తూ వస్తున్నాయి. అవసరం లేని ఆర్‌ఇ కొనుగోలు వల్ల విపరీతంగా మిగులు విద్యుత్‌ తేలి, వినియోగ దారులపై ట్రూఅప్‌ రూపంలో భారాలు పడుతున్నాయి. వాటిని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటం లేదు.

మిగులు విద్యుత్తుతో విద్యుత్‌ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉన్న మేరకు రాష్టాల్రు పిపిఎల ప్రకారం పొందని విద్యుత్‌కు స్థిర ఛార్జీలను వేల కోట్ల రూపాయల మేరకు చెల్లించాల్సి వస్తున్నది. చివరకు ఈ భారాలు వినియోగదారులపై పడుతున్నాయి.

పెత్తనం కేంద్రానిది..అధిక లాభాలు ఆశ్రిత పెట్టుబడిదారుల కార్పొరేట్‌ సంస్థలకు అన్న చందంగా సాగుతోంది.విద్యుత్‌ రంగంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విధానాల పర్యవసానాల కారణంగా విద్యుత్‌ అన్నది భారంగా మారుతోంది. తన విధానాలకు ప్రధాన కారణమైన మోడీ ప్రభుత్వం మాత్రం తానుగా ఇందుకు దమ్మిడీ ఆర్థిక సహాయం చేయటం లేదు.

గత ఎనిమిదేళ్ళ మోడీ ప్రభుత్వ కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల పారు బకాయిలు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు మాఫీ అయ్యాయి. ఇందులో అత్యధిక భాగం ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల బకాయిలే అని గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వాల డిస్కామ్‌ల రుణాల బకాయిలలో ఈ విధంగా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నది కూడా మనం గమనించాలి.

ఆ డిస్కమ్‌లు వాటికి విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా ప్రైవేటు ఉత్పత్తిదారులకు, భారీగా బకాయి పడటంతో కేంద్రం అప్పులు మంజూరు చేయించేందుకు ప్రతిపాదించి, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్‌ గ్యారంటీ ఇచ్చేందుకు షరతు విధించింది.

కేంద్రానికి చెందిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రావిూణ విద్యుత్‌ సంస్థలతో అలా మంజూరు చేయించిన రుణాల మొత్తాలను విద్యుత్‌ ఉత్పత్తిదారులకు నేరుగా ఆ రుణ సంస్థలతో చెల్లించేలా చేస్తోంది. డిస్కాములకు మంజూరు చేసిన ఆ సంస్థలు ఈ రుణాలపై బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారుల అవసరాలు తీరుతున్నాయి.

రుణాలిచ్చిన కేంద్ర ఆర్థిక సంస్థలకు లాభదాయక వడ్డీ వ్యాపారం జరుగుతున్నది. ఇలాంటి పథకాల వల్ల విద్యుత్‌ ఉత్పత్తిదారులకు డిస్కాముల బకాయిలు కేంద్ర రుణ సంస్థలకు చెల్లించాల్సిన రుణాల బకాయిలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సింగరేణి కూడా చేజారితో కోలుకోలేమన్న బాధను తెలంగాణ వ్యక్తం చేస్తోంది.

ఇది నిరంతర విద్యుత్‌పైనా తీవ్ర ప్రభావం పగడదని వాదిస్తోంది. ఈ క్రమంలో బొగ్గుబావుల వేలంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలి. సింగరేణి ప్రైవేటీకరణపైనా స్పష్టత ఇవ్వాలి. నిరంతర విద్యుత్‌పై దేశంలో ఒక విధానాన్ని కూడా ఆమోదించాల్సి ఉంది. అదే సమయంలోవిద్యుత్‌ వినియోగం ప్రజలకు భారం కాకుండా చూడాల్సి ఉంది.