Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రివెంజ్‌ కథతో రవితేజ రావణాసురుడు

రవితేజ ’రావణాసుర’విడుదల అయింది. టైటిల్‌ కొంచెం నెగటివ్‌ గా ఉండటం తో ఇందులో రవితేజ నెగటివ్‌ షేడ్‌ తో చేస్తున్నాడని అనుకున్నారు. అందుకని ఈ సినిమాపై కొంచెం ఆసక్తి రేగింది.

క్రిమినల్‌ లాయర్‌ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ గా పని చేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్‌) అనే అమ్మాయి కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన తండ్రి కేసు టేకప్‌ చెయ్యమని అడిగితే, ఆమె చెయ్యను అని చెప్తుంది.

అప్పుడు రవీంద్ర కలుగజేసుకొని హారికతో నేను ఒప్పిస్తా అని చెప్పి కనకమహాలక్ష్మి ఈ కేసు టేకప్‌ చేసేటట్టు చేస్తాడు. ఇంతకీ ఆ కేసు ఏంటంటే తన తండ్రి (సంపత్‌ రాజ్‌) మర్డర్‌ చేసినట్టుగా వీడియోలు, సాక్ష్యాలు అన్నీ పక్కాగా వున్నాయి, కానీ తన తండ్రి నిర్దోషి ఆ హత్య చెయ్యలేదు అని చెప్తుంది హారిక. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. అలాంటివే ఇంకొన్ని హత్యలు నగరంలో జరుగుతాయి,

అందులో సిటీ కమిషనర్‌ (మురళి శర్మ) కూడా హత్యకు గురి అవుతాడు. హారిక కూడా హత్యకి గురికాబడుతుంది. రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న హనుమంత రావు (జయరాం) ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో దీని వెనక ఎవరున్నారో కనుక్కోమని ఈ కేసు అతనికి ఇస్తారు.

ALSO READ: ఏజెంట్‌ పోస్టర్‌ విడుదల

ఇంతకీ ఈ హత్యలన్నీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళనే హత్య చెయ్యడానికి ఎందుకు పూనుకున్నాడు అన్నదే సినిమా కథ. దర్శకుడు సుధీర్‌ వర్మ రవితేజ తో ’రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఏ సినిమా అయినా, థ్రిల్లర్‌, సస్పెన్స్‌, హారర్‌, కామెడీ ఏదైనా కూడా ప్రేక్షకుడికి కనెక్ట్‌ కావాలి. కొన్నిసార్లు లాజిక్‌ లేకపోయినా, అది నమ్మేట్టు తీయగలగాలి, ప్రేక్షకుడికి ఆసక్తిని పెంచాలి. ఈ రెండిరటిలోనూ సుధీర్‌ వర్మ ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి.

ఒకసారి ఈ హత్యలు ఎవరు చేశారో తెలిసాక ప్రేక్షకుడికి సినిమా విూద ఆసక్తి పోయేలా చేసాడు దర్శకుడు.

ఎందుకంటే ఈ కేసును పరిశోధిస్తున్న అధికారికి తెలుసు హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు కానీ అతను ఏవిూ చెయ్యలేని పరిస్థితి. అదీ కాకుండా ముందు సన్నివేశం ఏమి జరుగుతుందో ప్రేక్షకుల ఇట్టే చెప్పేయగలరు.

చివరికి ఇది ఒక రివెంజ్‌ డ్రామా అని తెలుస్తుంది. అదీ కాకుండా ఇలాంటివి ఎన్ని సినిమాలు రాలేదు ఇంతకుముందు అనిపిస్తుంది. ఇందులో అంత గొప్ప కథా లేదు, సినిమా కూడా ఆసక్తికరంగా లేదు.ఇక నటీనటుల విషయానికి వస్తే, సినిమా అంతా రవితేజ కనపడతాడు. మొదట్లో కామెడీ సన్నివేశాల్లో తనదైన పంచ్‌ డైలాగ్స్‌ బాగున్నాయి, కానీ అతని నటన మాత్రం మామూలే.

ఇలాంటివి అతను ఎన్నో చేసాడు. అలాగే పాటల్లో కూడా బాగా డాన్స్‌ చేసి చూపించాడు. ’హైపర్‌’ ఆది ’జబర్దస్త్‌’ లో చేసినట్టుగా ఇక్కడ కూడా అతన్ని ఉపయోగించుకున్నారు అంతే. ఫరియా అబ్దుల్లా రెండు మూడు సన్నివేశాల్లో ఎక్కువ కనపడుతుంది. అంతే. ఎవరికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేదు.

మేఘా ఆకాష్‌ పరవాలేదు. అను ఇమ్మానుయేల్‌ రెండు సీన్స్‌ లో కనపడుతుంది. దక్ష కూడా అంతే. సుశాంత్‌ ని పరిచయం చేసినప్పుడు బాగా చేశారు, కానీ ఆ తరువాత మామూలే. పూజితా పొన్నాడ కూడా పోలీస్‌ పాత్రలో కనపడుతుంది. అన్నట్టు శ్రీరామ్‌ కూడా వున్నాడు

ఇందులో. చాలామంది ఒకటి రెండు సన్నివేశాలే. రావు రమేష్‌ పాత్ర నిడివి పెద్దగా ఉంటే బాగుండేది, కానీ అలాంటి బాగా చెయ్యగలిగే నటుడిని కూడా రెండు సన్నివేశాలకు కుదించారు, ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు దర్శకుడికి. మొత్తంగా సీక్వెన్స్‌ లేకుండా పోయిందన్న టాక్‌ ఉంది.